
నైతిక స్థైర్యంపై దాడులు
బదిలీ చేశారు సరే...
కారణం ఏదైనా నార్త్,సౌత్ స్టేషన్‌ల సిబ్బందిని బదిలీ అయితే చేసేశారు. కొత్తగా ఇక్కడకు సిబ్బందిని తీసుకురానున్నారు. అయితే పూర్తిస్థాయిలో సిబ్బందిని తీసుకువస్తారా..ఇప్పుడున్న అరకొర సిబ్బందితోనే ఎకై ్సజ్ స్టేషన్లను నడిపిస్తారా అన్నది వేచి చూడాలి.
● కూటమి నేతల మాట
కాదన్నందుకు బదిలీలు
● రెండు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది
ఒకేసారి మార్పు
రాజమహేంద్రవరం రూరల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోమని ఆదేశించేది వారే...తీరా చట్టాన్ని అమలు చేస్తే కక్ష సాధింపు చర్యలకు దిగేది వారే అన్నట్టుగా తయారైంది కూటమి నాయకుల తీరు. రాజ్యాంగ వ్యవస్థలు, పాలనా పరిస్థితులు, ప్రజాప్రయోజనాలు వంటివి పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నరీతిలో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులు నైతిక స్థైరాన్ని దెబ్బతీసే రీతిలో వీరు పేట్రేగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రెండు ఎకై ్సజ్ స్టేషన్‌లలో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేసి తాము అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్నే పాటించాలని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కూటమి నాయకుల అధికార దుర్వినియోగానికి బలైన రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సౌత్, నార్త్ స్టేషన్ల సిబ్బంది మౌనంగా ఇబ్బంది పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..
కఠినంగా వ్యవహరించినందుకేనా?
రాజమహేంద్రవరం ఎకై ్సజ్ నార్త్, సౌత్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని గురువారం బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నవోదయ 2.0 కింద సారాను అరికట్టడంలో రెండు స్టేషన్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ బదిలీకి కారణంగా చూపారు. అయితే వాస్తవ కారణం ఈ సిబ్బంది టీడీపీ, జనసేన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల నార్ట్ స్టేషన్ పరిధిలో ఒక టీడీపీ నాయకుడి సోదరుడిని అరెస్టు చేయడంతో అతను స్టేషన్‌పై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సౌత్ స్టేషన్ పరిధిలో శ్రీరామపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడిని సారా కేసులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు స్టేషన్ల సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయించినట్లుగా ఉద్యోగ వర్గాల్లో ముమ్మరంగా చర్చ నడుస్తోంది.
నిజాయితీగా పనిచేసినా..
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నార్త్, సౌత్‌స్టేషన్‌ల పరిధిలో 52 మద్యం షాపులు ఉన్నాయి. రెండు స్టేషన్‌ల పరిధిలో 400 మందికి పైగా విఽవిధ కేసులలో ముద్దాయిలు ఉన్నారు. ఈ రెండు స్టేషన్లలోనూ కలిపి 15 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. మద్యం షాపులపై పర్యవేక్షణ, కోర్టు పనులు, సారా నియంత్రణ చర్యలు, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం తదితర విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు రిజిస్టరు నిబంధనల ప్రకారం రెండు స్టేషన్‌లలో 30మందికి పైగా సిబ్బంది ఉండాలి. కానీ ఏళ్ల తరబడి సగం మందితోనే ఇక్కడ కథ నడిపిస్తున్నారు. ఇవి కాకుండా గోదావరిలంకలు, రాజానగరం తదితర ప్రాంతాల్లో రెండువందలకు పైగా సారాబట్టీలు ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజూ చేయాల్సిన పనులు చేస్తూనే అటు సారా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వాస్తవంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా చిట్టడవులను తలపించే తోటల మధ్యలోకి వెళ్లి సారాబట్టీలను నిర్మూలించడం ఈ అరకొర సిబ్బందితో సాధ్యం కాదన్నది ఉద్యోగ వర్గాల మాట. అందుకే సారా తయారీ నియంత్రణలో విఫలమయ్యారనే కారణంతో వీరిపై బదిలీ వేటు వేయడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే ఏళ్లతరబడి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడే బదిలీ వేటు చేయడం వెనుక టీడీపీ, జనసేన నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు.