
పరామర్శకు వెళుతూ మృత్యుఒడికి..
● ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు
● తల్లీ కుమార్తెలు, ఆటోడ్రైవర్ మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
● పటవల వద్ద ప్రమాదం
తాళ్లరేవు: ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు పోతాబత్తుల దుర్గ, లంకే భవానితో పాటు దుర్గ చెల్లెలు ఓలేటి లక్ష్మి శుక్రవారం గాడిమొగ పంచాయతీ చినవలసల గ్రామానికి సంగాడి గంగరాజును పరామర్శించేందుకు ఆటోలో బయలు దేరారు. గంగరాజు ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోకి వచ్చే సరికి వీరి ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పోతాబత్తుల దుర్గ (55), లంకే భవాని (35)తో పాటు యానాం కురసాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్ రాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓలేటి లక్ష్మిని అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సందర్శించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరామర్శకు వెళుతూ మృత్యుఒడికి..