ఫ అన్నవరం దేవస్థానంలో
పారిశుధ్య సిబ్బందికి అవస్థలు
ఫ ఇంకా అందని ఏప్రిల్ నెల జీతాలు
ఫ గత నెలలోనూ ఇదే పరిస్థితి
ఫ పట్టించుకోని అధికార యంత్రాంగం
అన్నవరం: ఒకసారి తప్పు జరిగితే పొరపాటు అని సరిదిద్దుకోవచ్చు.. రెండో సారి కూడా అదే పునరావృతమైతే ఏమనుకోవాలో దేవుడికెరుక. అన్నవరం దేవస్థానంలో అధికారుల పనితీరు సిబ్బందిని ఇబ్బందుల పాల్జేస్తోంది. సత్యదేవుని దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల జీతాలు ఇంకా చెల్లించలేదు. మే నెల కూడా మరో వారం రోజుల్లో ముగిసిపోతుండగా, ఇంకా గత నెల జీతాలు ఇవ్వకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే జీతమే తక్కువ.. అదీ సకాలంలో అందడం లేదని సిబ్బంది నిట్టూర్పు వదులుతున్నారు. ఈ ఆలస్యం ఈ నెల మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. గత నెలలో కూడా మార్చి నెల జీతం ఏప్రిల్ 30న ఇచ్చారు. అది కూడా జీతం ఆలస్యం అయ్యిందని, ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...?’ అంటూ ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసి ఆదరాబాదరాగా ఫైల్ నడిపి నెలాఖరున వారి అకౌంట్‌లో వేశారు. అయితే అధికారులు మాత్రం తమ తప్పేమీ లేదని పాత పాటే పాడుతున్నారు. గత నెలలో వివరణ ఇచ్చినట్టుగానే దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ ఆ సిబ్బందికి చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని ఆలస్యంగా బ్యాంకులో జమ చేయాల్సి రావడంతోనే జాప్యం అయ్యిందని అంటున్నారు. ఒకటి రెండ్రోజుల్లో జీతాలు చెల్లిస్తామని చెప్పుకొస్తున్నారు.
పని పెరిగింది.. జీతం ఆగింది
మే నెల ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల సందర్భంగా దేవస్థానంలో పారిశుధ్య సిబ్బంది అదనంగా విధులు నిర్వహించాల్సి వచ్చింది. దీనికితోడు వివాహాల కారణంగా పెళ్లిబృందాలతో దేవస్థానం రద్దీగా మారి చెత్త పెరిగింది. బాత్‌రూమ్‌లు, ఆలయ ప్రాంగణం, సత్రాలు, గదులు అదనంగా శుభ్రం చేయాల్సి వచ్చింది. ఇంత చేసినా కూడా జీతాలు అందించకపోవడంతో వారు అసంతృప్తి చెందుతున్నారు.
అప్పట్లో పదో తేదీకే..
హైదరాబాద్‌కు చెందిన కేఎల్‌టీఎస్ సంస్థ రెండేళ్లుగా దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ హయాంలో ప్రతి నెలా పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేవారు. గత నవంబర్‌తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థకు శానిటరీ కాంట్రాక్ట్‌కు ఎంపిక చేసేవరకూ విధులు నిర్వహించాలని దేవస్థానం కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. దాంతో మార్చి ఒకటో తేదీ నుంచి తాత్కాలికంగా శానిటరీ సిబ్బంది సరఫరాకు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి కాంట్రాక్ట్ అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానంలోని అన్ని విభాగాలు, సత్రాలు, దేవస్థానం ఆవరణ, ఆలయ ప్రాకారం, వ్రతమండపాలు, టాయిలెట్స్ తదితర చోట్ల మొత్తం 349 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ఈ సిబ్బందికి కనీస వేతన చట్టం ప్రకారం వేతనాలు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. వీరికి శానిటరీ ఏజెన్సీ ద్వారా నెలకు సుమారు రూ.55 లక్షలు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. ఏప్రిల్ నెల జీతాలు ఇంకా చెల్లించకపోవడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. పారిశుధ్య సిబ్బంది పీఎఫ్ మొత్తం వారి బ్యాంకు ఖాతాలకు కొత్త ఏజెన్సీ ఆలస్యంగా జమ చేయాల్సి రావడంతో జీతాలు చెల్లింపునకు జాప్యం అయ్యిందని అధికారులు తెలిపారు. త్వరలోనే చెల్లిస్తామన్నారు.
వీరి కష్టం తుడిచేవారేరీ!