అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య
అల్లవరం: అమలాపురం మండలం కామనగరువు గ్రామానికి చెందిన కామన భార్గవ్ (24) బోడసకుర్రు బ్రిడ్జిపై నుంచి వైనతేయ నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కామనగరువు గ్రామానికి చెందిన భార్గవ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో మోటార్ సైకిల్‌ని బోడసకుర్రు బ్రిడ్జిపై పార్కు చేసి నదిలోకి దూకేశాడని తెలిపారు. భార్గవ్ నదిలోకి దూకడంతో తన తమ్ముడిని రక్షించేందుకు అన్న రాజేష్ కుడా నదిలోకి దూకాడు. అయితే రాజేష్‌కు భార్గవ్ దక్కకపోవడంతో తన ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నాడు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండి, చాలా లోతుగా ఉండడంతో రాజేష్ ప్రాణాపాయ స్థితిలోకి చేరాడు. ఇంతలో బ్రిడ్జిపై నుంచి లారీ డ్రైవర్ పగ్గాన్ని రాజేష్‌కు అందించడంతో తాడుని పట్టుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇంతలో స్థానికంగా ఉన్న మత్స్యకారులు పడవలో వెళ్లి రాజేష్‌ని కాపాడి ఒడ్డుకి చేర్చారని పోలీసులు తెలిపారు. అయితే నదిలోకి దూకిన భార్గవ్ నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. అయితే సాయంత్రానికి భార్గవ్ మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకి చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చూసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తిరుమలరావు తెలిపారు. భార్గవ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తమ్ముడిని కాపాడేందుకు
నదిలోకి దూకిన అన్నయ్య
నీటి ప్రవాహంలో చిక్కుకున్న
మృతుడి అన్నను కాపాడిన స్థానికులు


