ఆదిలోనే హంసపాదు | - | Sakshi
Sakshi News home page

ఆదిలోనే హంసపాదు

Feb 17 2024 3:14 AM | Updated on Feb 17 2024 3:14 AM

- - Sakshi

రథాన్ని రాజగోపురం

లోపలకు క్రేన్‌తో

తీసుకుని వెళ్తున్న

దృశ్యం

సత్యదేవుని నూతన రథం ప్రారంభం

సాంకేతిక కారణాలతో

ఊరేగింపు వాయిదా

అన్నవరం: ఆదిలోనే హంసపాదు అన్నట్టు.. సత్యదేవు ని నూతన రథం ప్రారంభమైన వేళ.. స్వామి ఊరేగింపునకు సాంకేతిక కారణాలు ఆటంకంగా నిలిచాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అధికారులు రథాన్ని ప్రారంభించి, ఊరేగింపును వాయిదా వేశారు. వివరాలివీ.. రూ.34 లక్షల వ్యయంతో నిర్మించిన సత్యదేవుని నూతన టేకు రథాన్ని రథసప్తమి పర్వదినాన ప్రారంభించి.. దానిపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదే వి అమ్మవారిని వేంచేయించి, ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో ఊరేగించాలని పండితులు నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా కొత్త రథానికి దేవస్థానం పండితులు, ఈఓ కె.రామ చంద్ర మోహన్‌ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు రథంపై కలశ స్థాపన కూడా చేశారు. అనంతరం ఆ రథాన్ని ట్రాక్టర్‌కు కట్టి రత్నగిరికి చేర్చేందుకు సిద్ధం చేశారు.

అవాంతరాలు ఎదురయ్యాయిలా..

● నూతన రథాన్ని ట్రాక్టర్‌ సాయంతో రెండో ఘాట్‌ రోడ్డు మీదుగా ఆదిశంకర మార్గ్‌కు తీసుకువచ్చారు. అక్కడ స్పీడ్‌ బ్రేకర్ల పైనుంచి వెళ్తున్న సమయంలో రథం వెనుక చక్రాల పక్కన ఉన్న రాడ్డు విరిగిపోయింది. దీంతో రథం నిలిచిపోయింది. అనంతరం ఆ రాడ్డును తొలగించి సపోర్టుగా మరో రెండు రాడ్లు వేశారు. అనంతరం 12 గంటలకు రత్నగిరి పశ్చిమ రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు.

● పశ్చిమ రాజగోపురం పక్కన ఉన్న మార్గం గుండా ఆలయ ప్రాంగణంలోకి రథాన్ని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ మార్గం కన్నా రథం వెడల్పు ఎక్కువగా ఉంది. రథం 12 అడుగుల పొడవు, 7.4 అడుగుల వెడల్పు ఉండగా.. ఆ మార్గం వెడల్పు 7 అడుగులు మాత్రమే ఉంది. దీంతో రథాన్ని లోపలకు తీసుకువెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో రథాన్ని విడదీసి ఆ భాగాలను లోపలకు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. అది కూడా కుదరలేదు.

● ఇంజినీరింగ్‌ అధికారుల్లో ముందుచూపు లోపించడంతో ఈ సమస్య తలెత్తింది. రథం పొడవు, వెడల్పును బట్టి ఆ మార్గంలో అది లోపలకు వెళ్తుందో లేదో ఇంజినీరింగ్‌ అధికారులు నిర్ధారించాల్సి ఉంది. ఒకవేళ రథం లోపలకు వెళ్లలేని పరిస్థితి ఉంటే, దాని విడి భాగాలను ఆలయ ప్రాంగణంలోకి తరలించి, అక్కడే బిగించి ఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఈ ఆటంకాలకు కారకులైన సంబంధిత అధికారులపై ఈఓ రామచంద్ర మోహన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆకాశంలో విహరించిన రథం

సుమారు టన్ను బరువు కలిగిన ఈ రథాన్ని చివరకు బెల్టులతో క్రేన్‌కు తగిలించి, సుమారు 30 అడుగుల ఎత్తుకు లేపి, గంటసేపు ప్రయత్నించిన అనంతరం రాజగోపురం లోపలి వైపు ప్రాంగణంలోకి దింపారు. నేల మీద ఊరేగాల్సిన రథం కాస్తా స్వామి, అమ్మవారు లేకుండా క్రేన్‌ సాయంతో ఆకాశంలో విహరించడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. రథాన్ని సురక్షితంగా కిందకు దించిన క్రేన్‌ ఆపరేటర్‌ను ఈఓ అభినందించారు. అప్పటికి సమయం మధ్యాహ్నం 1.30 గంటలైంది. అప్పటికి ముహూర్తం మించిపోవడంతో నూతన రథంలో స్వామివారి ఊరేగింపును వాయిదా వేశారు. ఆలయ ప్రాంగణంలో నీడ కోసం కట్టిన గ్రీన్‌ షేడ్స్‌ క్లాత్‌ కూడా తగులుతూండటంతో రథాన్ని నైరుతి వ్రత మండపం వద్ద నిలిపివేశారు. మరో ముహూర్తంలో స్వామి, అమ్మవారిని ఊరేగించాలని నిర్ణయించారు. ఈలోగా గ్రీన్‌ షేడ్‌ క్లాత్‌ ఎత్తును మరో రెండడుగుల మేర పెంచాలని ఈఓ రామచంద్ర మోహన్‌ ఆదేశించారు. దేవస్థానం ఈఈ మురళి, డీఈలు బీఎస్‌ రాంబాబు, ఉదయ్‌, ఏఈఓలు కృష్ణారావు, పెద్ద సంఖ్యలో సిబ్బంది, వైదిక సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నూతన రథాన్ని ప్రారంభిస్తున్న ఈఓ రామచంద్రమోహన్‌,

పండితులు

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement