నగదు రహితం | - | Sakshi
Sakshi News home page

నగదు రహితం

Published Mon, Dec 11 2023 2:08 AM | Last Updated on Mon, Dec 11 2023 2:08 AM

సమావేశం నిర్వహించుకుంటున్న స్వయం సహాయక సంఘాల మహిళలు (ఫైల్‌) - Sakshi

సమావేశం నిర్వహించుకుంటున్న స్వయం సహాయక సంఘాల మహిళలు (ఫైల్‌)

పేటీఎం ద్వారానే రికవరీలు

గ్రామ సంఘానికి పొదుపు మహిళలు నగదు రూపంలో చెల్లించిన మొత్తం కొన్ని ప్రాంతాల్లో సీ్త్రనిధి ఖాతాకు జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో సెర్ప్‌ నగదు రహిత లావాదేవీలు ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ నగదు రహితంగా రూ.1.20 కోట్ల మేర నేరుగా సీ్త్రనిధి ఖాతాకు జమయ్యింది.

– కె.శ్రీరమణి, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌,

డీఆర్‌డీఏ, కాకినాడ జిల్లా

చురుకుగా రికవరీ

సీ్త్రనిధి రుణ వాయిదాల చెల్లింపులో మరింత పారదర్శకత, క్షేత్రస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనాన్ని తీసుకువచ్చేందుకు సెర్ప్‌ పేటీఎం విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో రికవరీలు చురుకుగా జరుగుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సీ్త్రనిధి రికవరీలు అనుకున్న లక్ష్యం దిశగా సాగుతోంది.

– ధర్మేంద్ర, సీ్త్రనిధి, అసిస్టెంట్‌

జనరల్‌ మేనేజర్‌, తూర్పు గోదావరి జిల్లా

సీ్త్రనిధిలో నగదు రహిత

చెల్లింపులకు శ్రీకారం

డిజిటల్‌ పేమెంట్లతో

అక్రమాల నివారణ

ఫలితమిస్తున్న కొత్త విధానం

రెండు నెలల్లో రూ.1.20 కోట్ల

మేర నగదు రహిత రికవరీలు

కాకినాడ సిటీ: మహిళల జీవనోపాధుల అభివృద్ధిలో సీ్త్రనిధి కీలకపాత్ర పోషిస్తోంది. సీ్త్రనిధి క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ద్వారా రుణాలు పొందిన మహిళలు వందలాది మంది పేదరికం నుంచి గట్టెక్కారు. అయితే సీ్త్రనిధి కింద తీసుకున్న రుణాలను రికవరీ చేస్తున్నప్పటికీ కొంత మంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఈ కారణంగా నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) పెరిగిపోతున్నాయి. కొన్ని మండలాల్లో కొత్త రుణాల పంపిణీకి అవకాశం కూడా లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో సీ్త్రనిధిలో అక్రమాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఇప్పటికే పేటీఎం యంత్రాలను కూడా సరఫరా చేసింది.

పలు మండలాల్లో సిబ్బంది చేతివాటం

జిల్లా నుంచి వలసలు ఎక్కువగా ఉంటూండటంతో వాటిని అరికట్టేందుకు, ప్రభుత్వం సీ్త్రనిధి కింద తక్కువ వడ్డీతో మహిళలకు రుణ సదుపాయం కల్పించి, వివిధ వృత్తుల్లో స్వయం ఉపాధి పొందేలా చర్యలు తీసుకుంది. అయితే స్వయం సహాయక సంఘాల మహిళలు సీ్త్రనిధి నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. రికవరీ మొత్తాన్ని ఆయా మహిళలు ప్రతి నెలా గ్రామైక్య సంఘానికి నగదు రూపంలో చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్ని గ్రామైక్య సంఘం ఖాతాలో వేసుకుని, దాని నుంచి సీ్త్రనిధి ఖాతాకు బదిలీ చేస్తున్నారు. అయితే మహిళలు చెల్లిస్తున్న మొతాన్ని కొంత మంది సిబ్బంది స్వాహా చేస్తున్నారు. దీంతో జిల్లాలోని అనేక మండలాల్లో సీ్త్రనిధి బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. ఒక మండలంలో బకాయి రూ.20 లక్షలకు మించితే ఆ మండలానికి రుణాలు నిలిపివేస్తారు.

అక్రమాలను నిరోధించేందుకే..

సీ్త్రనిధి రుణాలు తీసుకున్న మహిళలు వాటిని తిరిగి చెల్లిస్తున్నప్పటికీ, కొంతమంది సిబ్బంది చేతివాటం చూపుతూండటంతో.. దీనికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలకు శ్రీకారం చుట్టింది. డీఆర్‌డీఏ – వైఎస్సార్‌ క్రాంతి పథం(వైకేపీ)కి సంబంధించి జిల్లాలో తుని, జగ్గంపేట, పెద్దాపురం, తాళ్లరేవు క్లస్టర్లు ఉన్నాయి. మొదట ప్రతి క్లస్టర్‌లోని రెండేసి మండలాల్లో డిజిటల్‌ చెల్లింపులకు గత అక్టోబర్‌ 20న శ్రీకారం చుట్టారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యాన నగదు రహిత లావాదేవీలపై మహిళలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ నగదు రహిత లావాదేవీల ద్వారా దాదాపు రూ.1.20 కోట్ల మేర రికవరీ చేశామని సీ్త్రనిధి అధికారులు చెబుతున్నారు. పేటీఎం మెషీన్‌లో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, ఫోన్‌ పే, గూగుల్‌ పే చేయవచ్చు. డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డులు స్వైపింగ్‌ చేసి కూడా రికవరీ చేయవచ్చు. తద్వారా ఆ సొమ్ములు నేరుగా సీ్త్రనిధి ఖాతాకు జమవుతున్నాయి.

ఇక నుంచి రుణాలూ వ్యక్తిగత ఖాతాలకే..

స్వయం సహాయక సంఘాల్లో పది మంది మహిళలుంటారు. గ్రూపు మొత్తానికి రూ.5 లక్షల వరకూ, వ్యక్తిగతంగా అయితే రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ తక్కువ వడ్డీతో రుణం పొందవచ్చు. సీ్త్రనిధి నుంచి తీసుకుంటున్న వ్యక్తిగత రుణం కూడా ఇప్పటి వరకూ గ్రూపు ఖాతాకే జమవుతోంది. ఈ మొత్తాన్ని ఆయా గ్రూపు లీడర్లు బ్యాంకు నుంచి డ్రా చేసి సంబంధిత మహిళలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలా బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వడానికి కొంతమంది ముడుపులు ఆశిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో, ఇకపై సీ్త్రనిధి నుంచి తీసుకునే వ్యక్తిగత రుణాలను కూడా నేరుగా పొదుపు మహిళల వ్యక్తిగత ఖాతాలకే జమ చేయాలని నిర్ణయించారు. దీనివలన రుణాల మంజూరులో కూడా పారదర్శకత పెరుగుతుంది.

రూ.450 కోట్ల రుణాలు

సీ్త్రనిధి క్రెడిట్‌ కో–ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ద్వారా పొదుపు మహిళల జీవనోపాధుల అభివృద్ధికి 2019–20 నుంచి రుణాల పంపిణీ ముమ్మరం చేశారు. ఇప్పటి వరకూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.450 కోట్ల మేర రుణాలు పంపిణీ చేశారు. దాదాపు ఐదేళ్లలో 85,745 మంది మహిళలు ఈ రుణాలతో పలు వృత్తులను అభివృద్ధి చేసుకున్నారు. కొన్ని మండలాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో రికవరీ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement