ఆ బాలిక చదివే పాఠశాలలో ఆట మైదానం లేదు. ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేక సహాయం అందలేదు. అయినా ఆటపై మక్కువతో, అడ్డంకులను అధిగమించింది. కఠోర శ్రమతో సాఫ్ట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజయాలు సాధిస్తోంది. ఇలా లోకేశ్వరి దీపిక పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
కాజులూరు: కాకినాడ జిల్లా కరప మండలం కొంగోడుకు చెందిన కాకరపల్లి శ్రీనివాసరావు, నాగేశ్వరి దంపతులు కుమార్తె లోకేశ్వరి దీపిక కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. తండ్రి శ్రీనివాసరావు కాకినాడలోని ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుండగా, తల్లి నాగేశ్వరి గృహిణి. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చిన్నారికి చదువుతో పాటు ఆటలంటే ఎంతో మక్కువ.
ఆరో తరగతి నుంచే అడుగులు
ఆరో తరగతి నుంచే సాఫ్ట్‌బాల్‌పై ఆసక్తి పెంచుకున్న లోకేశ్వరి దీపిక ఆ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.సునీల్ కుమార్ పర్యవేక్షణలో తర్ఫీదు పొందింది. పాఠశాలలో సరైన వసతులు లేకపోయినా కఠిన శ్రమను నమ్ముకుని కర్నులు, శ్రీకాకుళం, చిత్తూరు, తిరుపతి, నర్సీపట్నం, కడప, పలమనేరు, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో జరిగిన వివిధ రాష్ట్రస్థాయి పోటల్లో పాల్గొని సత్తా చాటింది.
రాష్ట్రస్థాయిలో పథకాలు
ఫ 2024 (బొబ్బిలి)లో బ్రాంజ్ మెడల్
ఫ 2025 (పులివెందుల)లో సిల్వర్ మెడల్
ఫ 2025 (పలమనేరు)లో బ్రాంజ్ మెడల్
ఫ 2026 (బొబ్బిలి)లో బ్రాంజ్ మెడల్
ఫ బొబ్బిలిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనపరచిన దీపక మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది.
పోలీస్ అధికారి కావడమే లక్ష్యం
భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మరిన్ని పతకాలు సాధించడమే కాకుండా స్పోర్ట్స్ కోటాలో పోలీస్ అధికారిగా ఉద్యోగం సాధించడమే తమ జీవిత ఆశయమని దీపిక చెప్పింది. తన విజయాలకు అహర్నిశలు తర్ఫీదు ఇస్తున్న పీడీ జి.సునీల్ కుమార్‌కు, తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్న స్కూల్ హెచ్‌ఎం ఎస్‌ఎస్‌వీ సుశీలామణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
జాతీయ స్థాయిలో విజయ కేతనం
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో సెప్టెబర్ 27 నుంచి 30 వరకు జరిగిన 39వ జాతీయస్థాయి సాప్ట్ బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున దీపిక పోటీ పడింది. ఫైనల్‌లో కేరళపై 4 – 3 తేడాతో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించడంలో అత్యంత కీలకపాత్ర పోషించింది. తద్వారా బంగారు పతకంతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రాలు అందుకుంది.


