ఆశకు పోయి.. అసలు కోల్పోయి.. | - | Sakshi
Sakshi News home page

ఆశకు పోయి.. అసలు కోల్పోయి..

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

ఫ దొంగనోట్ల సాలిగూడులో కొందరు విలవిల

ఫ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు

ఫ నాశనమవుతున్న జీవితాలు

అమలాపురం టౌన్‌: తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆ క్రమంలో కొందరు మోసపోవడం, మరి కొందరు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ముఖ్యంగా దొంగనోట్లు అనే సాలిగూడులో చిక్కుకుని కొందరు వంచనకు గురవుతున్నారు. తాజాగా దొంగ నోట్ల వ్యాపారంలో మోసపోయిన వ్యక్తి ఆ వ్యాపారంలో భాగస్వామి అయిన వ్యక్తిని హత్య చేయడం కలకలం రేపింది.

ఉలిక్కిపడిన ఉమ్మడి జిల్లా

దొంగ నోట్ల వ్యాపార వివాదంతో అల్లవరం మండలం గోడిలంకలో హత్య జరగడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉలిక్కిపడింది. దీంతో ఆ వ్యాపారం చేసే వారిలోనే కాకుండా వాటిని చలామణి చేసే వ్యక్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి.

● అమలాపురానికి చెందిన ఓ సాధారణ వ్యాపారి దొంగ నోట్లతో అధికంగా సంపాందించాలని అత్యాశ పడ్డాడు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెంచిన ఓ వ్యక్తితో దొంగ నోట్ల మారకం విషయంలో వివాదం తలెత్తింది. దీంతో అతడిని అమలాపురం వ్యాపారి హత్య చేసి కటకటాల పాలయ్యాడు.

● కొన్నేళ్ల కిందట అంబాజీపేటకు చెందిన ఓ దొంగ నోట్ల వ్యాపారి చేతిలో అదే మండలం ముక్కామలకు చెందిన ఓ యువకుడు నిలువునా మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సామాన్య కుటుంబానికి చెందిన ఆ యువకుడు ప్రాణాలు తీసుకుంటూ తన అమ్మకు రాసిన చివరి లేఖ అందిరి కంట కన్నీరు పెట్టించింది.

చాలా సులువుగా ముద్రణ

గతంలో దొంగ నోట్ల ముద్రణ అంటే పెద్ద హడావుడి ఉండేది. ఇప్పుడు సాంకేతికత బాగా పెరగడంతో ఖరీదైన కలర్‌ జిరాక్స్‌ మెషీన్‌ ఉంటే చాలు దొంగ నోట్ల ముద్రణ ఈజీగా జరిగిపోతోంది. రూ.500. రూ.200, రూ.100 నోట్ల నకిలీలను ముద్రిస్తున్నారు. అమలాపురం, రావులపాలెం, రాజమహేంద్రవరం, అనపర్తి, కాకినాడ తదితర ప్రాంతాలు ఈ ముఠాల స్థావరాలు ఉన్నట్టు చెబుతున్నారు. ముద్రించిన నోట్లను పెట్రోలు బంక్‌లు, వైన్‌ షాపుల వద్ద ముఠా సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా మార్చేస్తారని సమాచారం.

ఆశ చూపి.. : ఇచ్చిన అసలు నోట్లకు నాలుగు నుంచి ఐదు రెట్ల దొంగ నోట్లు ఇస్తామని ఈ ముఠాలు చెబుతాయి. దీంతో కొందరు తక్కువ సమయంలో డబ్బు సంపాదించవచ్చనే అత్యాశతో వస్తున్నారు. అయితే దొంగనోట్ల ముఠా సభ్యులే వారిని మోసం చేస్తున్నారు. ముందుగా దొంగ నోట్ల ఇస్తామని, ఓ ప్రదేశానికి రావాలని చెబుతారు. అసలు నోట్లు తీసుకుని అక్కడకు వెళ్లాక, దొంగ నోట్లు ఇస్తున్న సమయంలో ముఠా సభ్యులే పోలీసుల్లా విజల్‌ వేస్తూ వస్తారు. దీంతో అందరూ అక్కడి నుంచి పారిపోతారు. దీంతో దొంగనోట్లు ఇవ్వకుండానే అసలు నోట్లు ముఠా సభ్యులు చేతికి వెళ్లిపోతాయి. ఒక్కోసారి టాయ్‌ కరెన్సీ అంటే చిన్న పిల్లలు అడుకునే నోట్లను బ్యాగ్‌లో పెట్టి, వాటిని నకిలీ నోట్లుగా మభ్యపెడతారు. అసలు నోట్లు తీసుకుని ముఠా సభ్యులు పరారవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement