రైతు వ్యతిరేక చట్టాలపై ఐక్యంగా ఉద్యమిద్దాం | - | Sakshi
Sakshi News home page

రైతు వ్యతిరేక చట్టాలపై ఐక్యంగా ఉద్యమిద్దాం

Oct 9 2026 12:14 AM | Updated on Oct 9 2026 12:14 AM

ఫ ప్రభుత్వాల విధానాలతో

మనుగడ ప్రశ్నార్థకం

ఫ నవంబర్‌లో దేశ వ్యాప్త ఉద్యమం

ఫ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య

అమలాపురం టౌన్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు ఐక్యంగా ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షుడు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్‌లో దేశ వ్యాప్త ఉద్యమం చేపడతున్నట్లు వెల్లడించారు. అమలాపురంలోని యూటీఎఫ్‌ హాలులో గురువారం మధ్యాహ్నం జరిగిన రాష్ట్ర రైతు సంఘం జిల్లా శాఖ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రోజు రోజుకు రైతు మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ జిల్లా స్థాయి విస్తృత సమావేశానికి సంఘం జిల్లా నాయకుడు సీహెచ్‌ సూర్యప్రకాశరావు అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుని వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతాంగం చారిత్రాత్మక ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతంతో కలిపి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి, వాటికి చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేశారు.

దళారుల దోపిడీ

రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు దడాల సుబ్బారావు, రాష్ట్ర కొబ్బరి రైతు సంఘం కన్వీనర్‌ కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించి దళారీ దోపిడీని అరికట్టాలన్నారు. జిల్లాలోని ప్రధాన పంట కాలువలు, డ్రెయిన్లలో దశాబ్దాలుగా పూడిక తీయకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు వేల ఎకరాల్లోని వరి పంట నీట మునిగి కుళ్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని డిమాండ్‌ చేశారు. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రైతులు కలెక్టరేట్‌ ముట్టడితో ఆందోళనకు దిగుతారని హెచ్చరించారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కారెం వెంకటేశ్వరరావు, పలు సంఘాల నాయకులు ఎం.వెంకటేశ్వరరావు, కేవీ రమణ, బీబీఆర్‌ ప్రసాద్‌, బీఎస్‌ఆర్‌ ప్రసాద్‌, జె.రాజారావు, రుద్రరాజు రవికుమార్‌, బి.ఆదినారాయణ, డి.రాంబాబు, కె.గోపాలన్‌, జి.మురళీ తదితరలు ప్రసంగించారు.

ఏకగ్రీవంగా కార్యవర్గం

సమావేశంలో జిల్లా రైతు సంఘానికి నూతన కమిటీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా కమిటీ కన్వీనర్‌గా సీహెచ్‌ సూర్యప్రకాశరావు, కో కన్వీనర్‌గా బీఎన్‌ శివకుమార్‌, సభ్యులుగా ఎం.వెంకటేశ్వరరావు, బి.రవికుమార్‌, జె.రాజారావు, కేవీ రమణ, ఎన్‌.జనార్దన్‌, బి.ప్రకాశరావు, ఎస్‌.బాపూజీ, బీబీఆర్‌ ప్రసాద్‌, ఎం.రాంబాబు ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement