మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామంలోని మ ధ్యలంకలో ఉన్న తుమ్మ చెట్లపై విడిది ఏర్పాటు చేసుకున్న విదేశీ పక్షులను వేటాడుతున్న ఇద్దరిని అటవీ శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికుడు కుడిపూడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఫారెస్ట్ రేంజ్ అధికారి సత్యనారాయణ తన సిబ్బందితో దాడి చేసి వారిని పట్టుకున్నారు. విదేశీ పక్షులను వేటాడితే ఉపేక్షించేది లేదని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కాగా.. చాలా రోజుల నుంచి విదేశీ పక్షుల వేట జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికై నా అధికారులు దీనిపై స్పందించి వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
సమస్యలను
మండలిలో ప్రస్తావిస్తా
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపీమూర్తి
రాజోలు: సమస్యల పరిష్కారానికి 23 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న వీఆర్‌ఏల దీక్షా శిబిరాన్ని గురువారం ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కనీస వేతనం లేకుండా అనేక మంది సేవలు అందిస్తున్నారన్నారు. వారి సమస్యలపై శాసన మండలిలో చర్చిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు వారి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వీఆర్‌ఏ సంఘ నాయకులు ఎమ్మెల్సీకి అందజేశారు. మండల యూటీఎఫ్ నాయకులు కె. రాజబాబు, కె.రవికుమార్, రేకపల్లి నాగేశ్వరరా వు, చింతా దుర్గాప్రసాద్, ఉండవల్లి శ్రీనివాస్, దొంగ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అంతర్వేది దేవస్థానంలో
టెండర్ల ఖరారు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొబ్బరి చెక్కలు పోగు చేసుకునేందుకు, చెప్పుల స్టాండ్ నిర్వహణకు గాను గురువారం అధికారులు టెండర్ కమ్ బహిరంగ వేలం నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎండోమెంట్స్ టి.నాగ విష్ణు పర్యవేక్షణలో ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 2028 మార్చి 31వ తేదీ వరకూ టెండర్లు ఖరారు చేశారు. పైకాలానికి కొబ్బరి చెక్కలు పోగు చేసుకునేందుకు రూ.27,55,000, చెప్పుల స్టాండ్ నిర్వహణకు రూ.3,56,000కు టెండర్లు ఖరారు చేశారు.


