ప్లా‘స్టిక్‌’ తీసేదెప్పుడో! | - | Sakshi
Sakshi News home page

ప్లా‘స్టిక్‌’ తీసేదెప్పుడో!

Oct 9 2026 12:20 AM | Updated on Oct 9 2026 12:20 AM

అన్నవరం: ప్రకటనలు ఘనం.. ఆచరణ శూన్యం అన్నట్టుగా ఉంది సత్యదేవుని సన్నిధిలో ప్లాస్టిక్‌ నిషేధం అమలు తీరు. సత్యదేవుని దర్శనానికి సాధారణ రోజుల్లో 20 వేలకు పైగా, పర్వదినాల్లో 50 వేల నుంచి లక్ష మంది వరకూ భక్తులు వస్తూంటారు. వీరిలో చాలా మంది రత్నగిరిపై పూజాద్రవ్యాలతో బాటు శీతల పానీయాలు, వాటర్‌ బాటిల్స్‌ కొనుగోలు చేస్తారు. రత్నగిరిపై ఉన్న ఆరు ఫ్యాన్సీ, శీతల పానీయాలు, క్యాంటీన్లలో సాధారణ రోజుల్లో 2 వేలకు పైగా, పర్వదినాల్లో 5 వేల నుంచి 10 వేల వరకూ ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ విక్రయిస్తున్నారు. వీటిని ఉపయోగించిన తర్వాత చాలా మంది రత్నగిరి పైనే పారేస్తూంటారు. వీటిని ట్రాక్టర్లపై సేకరించి రత్నగిరికి దూరంగా సత్యగిరిపై డంప్‌ చేస్తున్నారు. ప్రతి వారం ఒక లారీ వాటర్‌ బాటిల్స్‌ ఇలా డంపింగ్‌ జరుగుతోంది. ఆ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఆ ప్రాంతం కొండలా తయారవుతోంది. దానిని మళ్లీ పొక్లెయిన్‌తో భూమిలోకి బలంగా అణగదొక్కుతున్నారు. సాధారణంగా ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ భూమిలో కలిసిపోవాలంటే వంద సంవత్సరాలకు పైగా పడుతుందని నిపుణులు చెబుతారు. దీనినిబట్టి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించకపోతే సత్యదేవుని సన్నిధిలో పర్యావరణానికి హాని జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రత్నగిరికి అసలు ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ రానివ్వకుండా, విక్రయించనీయకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఆదేశాలు, తీర్మానాలు గుర్తున్నాయా సార్‌!

గత ఏడాది ఆగస్టు 7న దేవదాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ రాష్ట్రంలోని అన్ని దేవస్థానాల్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, సింగిల్‌ యూజ్డ్‌ ప్లాస్టిక్‌ కవర్ల వాడకాన్ని నిషేధిస్తూ ఆదేశాలిచ్చారు. కానీ, ఈ ఆదేశాలు ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. రత్నగిరిపై ప్లాస్టిక్‌ బాటిల్స్‌ ఉపయోగించకూడదనే ప్రకటన మచ్చుకు కూడా కనిపించదు. కమిషనర్‌ ఆదేశాలు అమలు చేయాలంటూ గత జూలై 24న జరిగిన దేవస్థానం ట్రస్ట్‌బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. విచిత్రంగా అప్పటి నుంచి జరిగిన ప్రతి ట్రస్ట్‌బోర్డు సమావేశంలోనూ సభ్యులకు అవే ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ అందిస్తున్నారు. వారు కూడా ఆ నీటినే తాగుతున్నారు. కనీసం ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వద్దని తామే తీర్మానం చేసిన వారికి, అధికారులకు గుర్తుందో లేదో అర్థం కాని పరిస్థితి. పర్యావరణానికి హాని జరగని సురక్షిత ప్లాస్టిక్‌ బాటిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు లేదా గాజు సీసాలైనా ఇవ్వవచ్చు. కానీ, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, అధికారులు ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదు.

ఫ సత్యదేవుని సన్నిధిలో కానరాని నిషేధం

ఫ ప్రస్తుతం ప్రకటనలకు, ఫైళ్లకే పరిమితం

ఫ ట్రస్ట్‌ బోర్డు సమావేశాల్లోనే యథేచ్ఛగా వాడకం

గత ప్రభుత్వ హయాంలో పకడ్బందీగా అమలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టు 15 నుంచి సత్యదేవుని సన్నిధిలో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌పై నిషేధం అమలులోకి వచ్చింది. అప్పట్లో కొండ దిగువన టోల్‌గేట్‌ వద్ద, మెట్ల దారిలో భక్తుల లగేజీలు తనిఖీ చేసి, ప్లాస్టిక్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకునేవారు. గాజు, రాగి, స్టీలు, నాన్‌ ప్లాస్టిక్‌ బయో ఎలైట్‌ (సులభంగా మట్టిలో కలిసిపోయే మొక్కజొన్న పౌడర్‌తో తయారు చేసిన) వాటర్‌ బాటిల్స్‌ మాత్రమే విక్రయించేవారు. అప్పట్లో భక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్లాస్టిక్‌ బాటిల్స్‌ను కిన్లే కంపెనీ మిషన్లలో పొడి చేయించి, తిరిగి ఆ కంపెనీకే విక్రయించేవారు. అప్పట్లో ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్‌ ఖరీదు రూ.20 కాగా, దానికి బదులు గాజు వాటర్‌ బాటిల్‌ లీటరు రూ.60, బయో ఎలైట్‌ వాటర్‌ బాటిల్‌ రూ.40కి విక్రయించేవారు. ఖాళీ గాజు సీసా తిరిగిస్తే రూ.40 రిటర్న్‌ ఇచ్చేవారు. బయో ఎలైట్‌ వాటర్‌ బాటిల్‌ను భక్తులు తీసుకు వెళ్లి, మూడు నెలల పాటు వాడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించాలని పలువురు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement