పైసలు పెడితేనే.. ఫైల్‌ కదిలేది! | - | Sakshi
Sakshi News home page

పైసలు పెడితేనే.. ఫైల్‌ కదిలేది!

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

కాకినాడ లీగల్‌: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి అవినీతి మరక అంటుకుంటోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యాలయం పరిధిలో జిల్లాలోని 9 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. అక్కడ ఎడిట్‌ ఇండెక్స్‌, సొసైటీలు, ఫర్మ్‌, ప్రొబిటెడ్‌ లిస్ట్‌ నుంచి తొలగింపు, స్టాంప్‌ డ్యూటీ లెక్కింపు, అక్రమ రిజిస్ట్రేషన్ల తొలగింపు, ఇతర పనులతో పాటు పరిపాలనా, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలకు జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి పనికి నిబంధనల పేరుతో లోపాలు చూపించి, అవి సరిచేయాలంటే ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, మామూళ్లు ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

గతం.. అవినీతిమయం

గత ఏడాది మార్చి 28న కాకినాడ జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో గ్యాస్‌ ఏజెన్సీకి సంబంధించిన ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో రూ.1.15 లక్షలు లంచం తీసుకున్నారని అప్పటి జిల్లా రిజిస్ట్రార్‌ కె.ఆనందరావుతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిని అరెస్ట్‌ చేసిన ఘటన సంచలనం సృష్టి్‌ంచింది. ఈ ఘటన తర్వాత కూడా కార్యాలయంలో అవినీతి ఆగలేదని ఆరోపణలు వస్తుండటం గమనార్హం.

లోపాలుంటే.. కాసుల పంటే!

ఆస్తి రిజిస్ట్రేషన్‌ తర్వాత (ఈసీ)లో తప్పులు నమోదైతే వాటిని సరిచేసేందుకు ఎడిట్‌ ఇండెక్స్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఆన్‌లైన్‌ ద్వారా జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుతాయి. త్వరగా చేయాలంటే ముడుపులు ఇవ్వాల్సిందే, లేకపోతే నెలల తరబడి కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆన్‌ రిజిస్టర్డ్‌ అగ్రిమెంట్లతో కేసు దాఖలు చేసిన దానికి స్టాంప్‌ డ్యూటీని లెక్కించడానికి నెలలు పడుతోందని న్యాయవాదులు చెబుతున్నారు. ఇలా ప్రతి పనికీ ముడుపులు ఇవ్వకపోతే నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.

భవనం ఉన్నా.. ఖాళీ స్థలంగా?

భవనం ఉన్నా ఆస్తిని ఖాళీ స్థలంగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేసిన విషయం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి సమాచారం తెలిసినప్పుటికీ ఆ యజమాని వద్ద నుంచి మామూళ్లు తీసుకుని పక్కన పెట్టారని విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదాయానికి ఇలా గండి కొడుతున్నారని పలువురు దస్తావేజు లేఖర్లు పేర్కొంటున్నారు. ఏసీబీ తనిఖీలకు సంబంధించి ఆ శాఖలో కొంతమంది సిబ్బంది ద్వారా సమాచారం ముందుగానే చేరుతోందని, దీంతో ఆ రోజుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యేక క్యాబిన్‌కు నిధులు ఎలా?

జిల్లా రిజిస్ట్రార్‌ గదిలో ప్రత్యేక క్యాబిన్‌ ఇటీవల నిర్మించారు. దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదని పలువురు అంటున్నారు. ప్రభుత్వ నిధులు లేకపోయినా క్యాబిన్‌ నిర్మాణానికి నిధుల ఎక్కడి నుంచి సమకూర్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆస్తుల అక్రమ రిజిస్ట్రేషన్లపై జిల్లా కలెక్టర్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఉదాహరణలకు కొన్ని ఘటనలు

ఆస్తి రిజిస్ట్రేషన్‌ సమయంలో పొరపాటుగా వివరాలు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తరువాత ఆ తప్పును ఆస్తి యజమాని సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఇండెక్స్‌ కోసం సర్పవరం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేశారు. అనంతరం జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద ఆన్‌లైన్‌లో వివరాలు వెళ్లగా, ఎడిట్‌ ఇండెక్స్‌ చేయడానికి నిరాకరించారు. ఆస్తి యజమాని అనేకసార్లు కార్యాలయం చుట్టూ తిరిగి, ముడుపులు ఇస్తేనే చేశారని అంటున్నారు.

ఆన్‌ రిజిస్టర్‌ అగ్రిమెంట్‌తో తుని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో గణేష్‌ అనే వ్యక్తి దావా దాఖలు చేశారు. ఆ కోర్టులో ఓ.ఎస్‌.నెం. 57/2025 కేసు నమోదైన తర్వాత స్టాంప్‌ డ్యూటీని లెక్కిండానికి జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయానికి గత ఏడాది డిసెంబర్‌ నెలలో పంపారు. ఇప్పటికి 10 నెలలైనా స్టాంప్‌ డ్యూటీ లెక్కించలేదని న్యాయవాది పేర్కొన్నారు. వారి నిర్లక్ష్యంతో కోర్టు కేసు వాయిదా పడుతుందని అన్నారు.

వీడియో గ్రాఫర్ల సొసైటీ రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తులో పదేపదే లోపాలు చూపుతూ మూడుసార్లు తిరస్కరించారని బాధితులు తెలిపారు. దీనిపై రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్‌ జరిగిందన్నారు. ముడుపుల కోసం లోపాలు చూపిస్తూ మూడుసార్లు తిరస్కరించారని సంఘం సభ్యులు ఆరోపించారు.

జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంపై

అవినీతి మరక

లోపాలు చూపి ముడుపుల వసూళ్లు?

గతంలో లంచం తీసుకుని

పట్టుబడ్డ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement