బహిరంగంగా వివరాలు
ప్రకటించాలని ఎమ్మెల్సీ వినతి
అమలాపురం రూరల్: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు కేటాయించిన బోట్ల వివరాలను అర్హులైన మత్స్యకారులకు తెలియజేసి పారదర్శకంగా దరఖాస్తులు స్వీకరించాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మత్స్యశాఖ కార్యాలయ రికార్డులకే సమాచారం పరిమితం కాకుండా, పథకం ద్వారా ప్రయోజనం పొందగలిగిన మత్స్యకారులకు బోట్లు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాకు మంజూరైన బోట్ల సంఖ్య, ఒక్కో బోటు విలువ, ప్రభుత్వం అందించే సబ్సిడీ, అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు చేసే ప్రదేశం, విధానం, చివరి తేదీ వంటి వివరాలను స్పష్టంగా ప్రకటించాలని సూచించారు. పథకాలు అందుబాటులో ఉన్నాయని సాధారణ ప్రకటన చేయకుండా, పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందించాలని పేర్కొన్నారు. సుమారు 50 ఫాథమ్స్ వరకు సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు భద్రత, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
హత్యాయత్నం కేసుల్లో
నిందితుడికి జైలు
దేవరపల్లి: గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో ఒకే రోజు నమోదైన రెండు వేర్వేరు హత్యాయత్నం కేసుల్లో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 6 వేల జరిమానా విధిస్తూ కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి గంధం వెంకటలక్ష్మి సరస్వతి సోమవారం తీర్పు వెలువరించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన నిందితుడు గేరా వీరవెంకట సత్యనారాయణ 2021 మే నెల 30న హుకుంపేటలో స్థల వివాదం కారణంగా నాయుడు వీరకృష్ణపై గునపంతో దాడి చేశాడు. అదేరోజు కొద్ది సేపటి తర్వాత తన కోడలి ఉద్యోగానికి సంబంధించిన పాత గొడవల కారణంగా హుకుంపేటలోనే మునిశెట్టి సాయిశ్రీకళ్యాణ్, మునిశెట్టి లక్ష్మి అనే తల్లి కొడుకులపై కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలపై గోపాలపురం పోలీస్ స్టేషన్‌లో అప్పటి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం రెండు కేసులు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి పై విధంగా శిక్ష విధించారు.


