రంపచోడవరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 8న పోలవరం జిల్లా రంపచోడవరం మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కె.దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. కాకవాడలో హెలీప్యాడ్, బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాలు, రాకోట గ్రామంలో గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్పీ కె.చక్రవర్తి, జాయింట్ కలెక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ డొనక పృధ్వీ రాజ్‌కుమార్, ఇంజనీరింగ్ అధికారులు శ్రీనివాసరావు, భవాని తదితరులతో కలిసి దినేష్ కుమార్ సోమవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. రచ్చబండలో గ్రామస్తుల నుంచి వచ్చే సమస్యలను సంబంధిత శాఖల అధికారులు శాఖల వారీగా నమోదు చేసి, తక్షణ పరిష్కారం చూపేలా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అక్టోబరు 7వ తేదీలోగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.


