రావులపాలెం: వైఎస్సార్ సీపీ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా రావులపాలెం మండలం కొమరాజులంక గ్రామానికి చెందిన గాడి ఝాన్సీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం రాత్రి పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆమెను సత్కరించి అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
అదుపు తప్పిన ప్రైవేటు బస్సు..
తప్పిన ప్రమాదం
కె.గంగవరం: మండల పరిధిలోని బాలాంత్రం వద్ద సోమవారం ఉదయం ప్రైవేటు బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి యానాం వెళుతున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి కాలువ గట్టు ఒడ్డుకు వచ్చి ఆగింది. ఎవరికీ ఏ విధమైన గాయాలు కాలేదు.
విద్యార్థులు జానపద
పోటీలకు సిద్ధం కావాలి
ముమ్మిడివరం: జాతీయ స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలకు విద్యార్థులు సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖాధికారి మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. ముమ్మిడివరం విద్యాశాఖ కార్యాలయంలో పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ఆరోగ్య, పర్యావరణ, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన పౌరసత్వం, లింగ సమానత్వం, మాదక ద్రవ్యాల నివారణ, మానసిక ఆరోగ్యం, దేశభక్తి వంటి అంశాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీబీ సెక్రటరీ బి.హనుమంతరావు, డైట్ బొమ్మూరు భౌతిక శాస్త్ర అధ్యాపకుడు నోడల్ అధికారి కే.కృష్ణ సాయి పాల్గొన్నారు.
పీఆర్సీ నివేదిక ఇప్పించండి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక మోరంపూడిలోని సిటీ మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా ఏపీటీఎఫ్ (1938) సమావేశం సోమవారం జరిగింది. దీనికి జిల్లా అధ్యక్షుడు కె.డేవిడ్ లివింగ్‌స్టన్ అధ్యక్షత వహించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు వి.అప్పయ్యశాస్త్రి మాట్లాడుతూ వెంటనే పీఆర్సీ నివేదిక ఇప్పించాలని అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.ఉదయబ్రహ్మం, జిల్లా ప్రధాన కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.


