● అన్నయ్య, స్నేహితుడితో కలిసి దారుణం
● ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ అష్రఫ్ అలీ
రంపచోడవరం: రాజవొమ్మంగి మండలంలో ఇటీవల జరిగిన హత్య కేసుకు సంబంధించి మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఆష్రఫ్ అలీ తెలిపారు. రంపచోడవరంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డ గ్రామానికి చెందిన పల్లె శ్రీనివాస్ అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కేడీపేట దగ్గరలోని ఏఎల్‌పురం గ్రామానికి చెందిన తన చిన్నాన్న చిటికెల రాంబాబు వద్ద ఉంటూ అతని పాన్‌షాప్‌లో పనిచేసేవాడు. పిల్లలు లేని కారణంగా ఆస్తి కాజేయాలనే ఉద్దేశంతోనే అక్కడ ఉన్నాడని రాంబాబు మేనల్లుడు కోరుప్రోలు వీరబాబుతో తరచూ గొడవ పడుతుండేవాడు. శ్రీనివాస్ ప్రవర్తన బాగోకపోవడంతో గ్రామానికి పంపించేశాడు. మద్యం సేవిద్దామని వీరబాబును వట్టిగెడ్డ గ్రామ శివారులోని చేను పాకల వద్దకు శ్రీనివాస్ తీసుకెళ్లాడు. శ్రీనివాస్, అన్నయ్య శ్రీరామమూర్తి, స్నేహితుడు గొర్లె అప్పలనాయుడు వీరబాబుతో మద్యం తాగించారు. అనంతరం వీరబాబును కత్తితో పొడిచి, కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తాడుతో కట్టి పక్కనే ఉన్న కాలువ ఒడ్డున గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. మేనల్లుడి ఆచూకీ కోసం రాజవొమ్మంగి స్టేషన్‌లో రాంబాబు ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం శవాన్ని బయటకు తీసి పంచనామా జరిపి సాక్ష్యాలను సేకరించినట్టు డీఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మూడు టీంలను ఏర్పాటు చేశామని బోయపాటి జంక్షన్ వద్ద నిందితులను ఆదివారం అదుపులోకి తీసుకున్నామన్నారు. రంపచోడవరం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ అష్రఫ్ అలీ తెలిపారు.


