గాయపడిన మధ్యాహ్న భోజన కార్మికురాలు
రాజోలు: సిలిండర్ నుంచి గ్యాస్ లీకై రాజోలు బాలుర ఉన్నత పాఠశాల మధ్యాహ్న వంటశాలలో అగ్నిప్రమాదం సోమవారం జరిగింది. విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ గొట్టానికి మంటలు వ్యాపించాయి. దీంతో భోజన తయారీ పనుల్లో నిమగ్నమైన ఉన్న ఏడుగురు ప్రాణభయంతో వంటగదిలో నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలతోపాటు, పొగ వ్యాపించడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించిన కార్మికురాలు చిట్టూరి మంగాదేవి చేతులు, పొట్ట భాగంగా గాయాలయ్యాయి. మంగాదేవిని రాజోలు ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అమలాపురం కిమ్స్‌కు తరలించారు. రాజోలు అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద స్థలాన్ని డీవైఈఓ కిషోర్ కుమార్ సందర్శించారు. అగ్నిప్రమాదంతో వంటశాలలో కొన్ని వస్తువులు, సామాన్లు కాలిపోయాయని పేర్కొన్నారు. ఘటన వివరాలను కలెక్టర్‌కు నివేదిక ద్వారా పంపించినట్టు ప్రధానోపాధ్యాయురాలు కె.సరస్వతి తెలిపారు.


