సమస్యల హారన్‌! | - | Sakshi
Sakshi News home page

సమస్యల హారన్‌!

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం.. సుఖవంతం అనేది ఒకప్పటి మాట.. ఈ ప్రయాణం నరకం ఇప్పటి మాట.. ‘సీ్త్రశక్తి’ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చినా, అందుకు తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడం కొత్త సమస్యను తెచ్చిపెడుతోంది. జిల్లాలో ఉన్న బస్సులనే తగ్గించేయడంతో సమస్యల హారన్‌ మోగుతోంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆపసోపాల నడుమ వెళ్లాల్సి వస్తోంది.

కొత్తపేట: ముందస్తు ఆలోచన లేకుండా పథకాలు అమలు చేస్తే ఇలానే ఉంటోంది. చంద్రబాబు ప్రభుత్వం ‘సీ్త్రశక్తి’ ఉచిత బస్సు పథకం అమలును తుస్సుమనిపిస్తోంది. ముందుచూపు లేకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా అమలు చేయడం సమస్యలకు దారితీస్తోంది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు డిపోల ద్వారా గత ఏడాది జూలై నాటికి పల్లె వెలుగు (పీవీజీ), అల్ట్రా పల్లె వెలుగు (అల్ట్రా పీవీజీ), ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, అమరావతి, నైట్‌ రైడర్‌ కలిపి మొత్తం 301 సర్వీసులు కాగా.. అద్దె బస్సులు 72 ఉండేవి. ఇందులో సీ్త్రశక్తి ఉచిత బస్సులు 193. ఈ ఏడాది జూలై నాటికి మొత్తం సర్వీసులు 288కి తగ్గిపోయాయి. ఇందులో సీ్త్రశక్తి ఉచిత బస్సులు 180కి చేరాయి. కాలక్రమంలో బస్సులు కండిషన్‌ లేకపోవడంతో వాటిని కుదించారు. అసలే ఉచిత బస్సు పథకం అమలవుతున్న వేళ, రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సులను పెంచాల్సి ఉండగా, తగ్గించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఇదిలా ఉంటే కాలం చెల్లిన బస్సులను నడపడం ఆర్టీసీ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. ప్రభుత్వం ఉచిత పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నా, సమస్యలను పరిష్కరించడానికి మాత్రం చొరవ చూపడం లేదు.

ఎదురుచూపులతో సరి!

సరిపడా బస్సులు లేక జిల్లాలోని చాలాచోట్ల బస్టాప్‌లలో ప్రయాణికులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఎట్టకేలకు వచ్చినా, బస్సు కిక్కిరిసి ఉంటుంది. ఫుట్‌బోర్డుపై సైతం నిలబడి ఉండటంతో బస్‌ ఆగకుండానే వెళ్లిపోతోంది. ఆ స్టాప్‌లో దిగాల్సిన ప్రయాణికులను సుమారు వంద మీటర్ల ముందుకు తీసుకెళ్లి అక్కడ దించుతున్నాయి. బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు పరుగు పరుగున వెళ్లి అందుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి బస్సును చేరుకోకుండానే వెళ్లిపోతుంది. ఇలా చాలాచోట్ల పరిస్థితి ఉంది. బస్సులు కిక్కిరిసి ఉండడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక నిత్యం అవస్థలు పడుతున్నారు. ప్రతి స్టాప్‌లోనూ విపరీతమైన రద్దీ కారణంగా బస్సులు ఎక్కడానికి, దిగడానికి ఆలస్యం అవుతుంది. ఇప్పటికై నా ప్రభుత్వం అదనపు బస్సులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

ఖాళీలు భర్తీ చేయకుండా..

ఆర్టీసీ సంస్థలో సిబ్బంది ఖాళీలను భర్తీ చేయకపోవడం ఇబ్బందిగా మారుతోంది. సంస్థలో ప్రతి నెలా ఉద్యోగ విరమణ పొందేవారితో పోస్టులు ఖాళీ అవుతున్నా, భర్తీ చేసే ఆలోచన యాజమాన్యానికి పట్టడం లేదు. అదనపు సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై పని ఒత్తిడి రెట్టింపైందని పలువురు వాపోయారు. జిల్లాలోని 4 డిపోల పరిధిలో సుమారు 1,500 మంది డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికల్‌ సిబ్బంది, ఏడీసీలు ఉండాల్సి ఉండగా సుమారు 400 ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 1,100 మంది పనిచేస్తున్నట్టు సమాచారం. తీవ్రమైన ఒత్తిడి కారణంగా తాము మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నామని, పలువురు కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ప్రయాణికులు ఇలా..

సీ్త్రశక్తి పథకం అమలుకు ముందు గత ఏడాది జూలైలో జిల్లాలోని అమలాపురం, రామచంద్రపురం, రావులపాలెం, రాజోలు డిపోల ద్వారా అన్ని సర్వీసుల్లో సరాసరి రోజుకు 74,400 మంది ప్రయాణించగా, ఈ ఏడాది జూలైలో ఒకరోజు 1,38,700 మంది ప్రయాణించారు. అంటే 64,300 మంది (86.42 శాతం) ప్రయాణికులు పెరిగారు. ఒక్క ఉచిత బస్సు సర్వీసుల్లో గత ఏడాది జూలైలో 67,412 మంది ప్రయాణిస్తే, ఈ ఏడాది జూలైలో 88,255 మంది ప్రయాణించారు. అంటే 20,843 మంది (30.92 శాతం) పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

55 మంది సీటింగ్‌లో 90 మంది

కేవలం 55 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 90 మందికి పైగా ప్రయాణికులు ఎక్కుతున్నారు. బస్సు లోపల కనీసం నిలబడటానికి కూడా జాగా ఉండడం లేదు. ఐడీ కార్డులు పరిశీలించి అందరికీ టికెట్లు కొట్టేలోపే తదుపరి స్టాప్‌ వచ్చేస్తోందని కండక్టర్లు వాపోతున్నారు. ఇదిలా ఉంటే కండిషన్‌లో లేని బస్సుల్లో ఇంత మందిని తీసుకెళ్లడం కత్తిమీద సాములా మారుతోందని సిబ్బంది వాపోతున్నారు.

జిల్లాలో డిపోల వారీగా ఉచిత బస్‌ సర్వీసులు

డిపో పల్లె వెలుగు అల్ట్రా ఎక్స్‌ప్రెస్‌ మొత్తం

ఆర్టీసీ అద్దె పీవీజీ అద్దె ఆర్టీసీ అద్దె సర్వీసులు

అమలాపురం 23 9 8 13 12 65

రామచంద్రపురం 27 12 4 0 0 43

రావులపాలెం 29 7 9 0 0 45

రాజోలు 20 4 3 0 0 27

మొత్తం 99 32 24 13 12 180

ఉచిత బస్సు.. అమలులో తుస్సు

సీ్త్రశక్తి పథకానికి ఆపసోపాలు

పెరిగిన ప్రయాణికులు, తగ్గిన బస్సులు

తుక్కు బస్సుల్లోనే ‘ఉచిత’ ప్రయాణం

55 మంది సీటింగ్‌లో

90 మందికి పైగా లోడ్‌

జిల్లాలో 193 నుంచి

180కి తగ్గిన సర్వీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement