అమలాపురం రూరల్: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏలు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారంతో 19వ రోజుకు చేరింది. అమలాపురం తహసీల్దార్ కార్యాయలం వద్ద వారి నిరసన కొనసాగించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని వీఆర్‌ఏలు డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘ మండల అధ్యక్షుడు మొగలికుదురు లక్ష్మణరావు, కార్యదర్శి మోటూరి ప్రశాంత్ కుమార్, ఉపాధ్యక్షుడు మధుర మంగ, లుటుకుర్తి విజయ్‌బాబు, మగాపు శ్రీనివాస్, మునికోటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
నేడు యఽథావిధిగా
పీజీఆర్‌ఎస్
అమలాపురం రూరల్: జిల్లా స్థాయి పీజీఆర్‌ఎస్ (మీకోసం) రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం యఽథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అర్జీలను వెబ్‌సైట్ ద్వారా అన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు. తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లో కూడా పీజీఆర్‌ఎస్ జరుగుతుందన్నారు.
ఆబోతుకు విజయవంతంగా
శస్త్రచికిత్స
అమలాపురం టౌన్: స్థానిక శ్రీగౌతమ మహర్షి గో సంరక్షణ గోశాలో ఓ వీధి ఆబోతు రెండు కాళ్లకు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎల్.విజయరెడ్డి ఆధ్వర్యంలో పశు వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. అమలాపురం రూరల్ మండలం బండార్లంకలో వీఽధి ఆబోతును ఇటీవల గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఆ నాలుగేళ్ల ఆబోతు తీవ్రంగా గాయపడింది. కుడి ముందు కాలు, కుడి వెనుక కాలు విరగడంతో నడవలేని స్థితిలో పడి ఉంది. ఆబోతును గోశాలకు తీసుకువచ్చి సాకుతున్నారు. విరిగిన కాళ్లకు ఫైబర్ కాస్ట్ వేసి కట్టు కట్టారు. ఆబోతు విరిగిన కాళ్లకు డాక్టర్ విజయరెడ్డితో పాటు పశు వైద్యులు ఎం.నారాయణరావు, చంద్రశేఖరరెడ్డి, తేజ, పశు సిబ్బంది సమన్వయంతో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు.
కార్తికమాస ఏర్పాట్లపై సమీక్ష
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో కార్తిక మాస ఏర్పాట్లపై దేవస్థానం సిబ్బందితో ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలన్నారు. కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి వంటి పర్వదినాలు, క్షీరాబ్ది ద్వాదశి నాడు సత్యదేవుని తెప్పోత్సవం, కార్తిక పౌర్ణిమ నాడు గిరిప్రదక్షిణకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసే అవకాశం ఉందన్నారు. ఆ రోజుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై విభాగాల వారీగా నివేదికలు అందజేయాలని సూచించారు. సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు చిట్టి శివ ఘనపాఠి, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, వ్రతపురోహిత సంఘం అధ్యక్షుడు ఛామర్తి కన్నబాబు, డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఈఈ రామకృష్ణ. ఏఈఓలు శ్రీనివాస్, బలువు సత్యశ్రీనివాస్, అనకాపల్లి ప్రసాద్, కృష్ణప్రసాద్, ఎలక్ట్రికల్ డీఈ జల్లూరి సత్యనారాయణ, డీఈ (సివిల్) బీఎస్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


