ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన
కొత్తపేట: బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం ఓ బాలింత మృతి చెందిన సంఘటన కొత్తపేటలో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. బీర బేబీ (36) పుట్టిల్లు కొత్తపేట మండల పరిధిలోని పలివెల చినపేట. కాగా అత్తిల్లు దుళ్ల గ్రామం. బేబీ రెండో కాన్పు పురుడు నిమిత్తం పుట్టింటికి వచ్చి, నెలలు నిండిన తర్వాత కొత్తపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం సాయంత్రం చేరింది. శనివారం మధ్యాహ్నం ఆపరేషన్ చేయగా ఆడబిడ్డకు జన్మించింది. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి చేరడంతో వెంటనే కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో రావులపాలెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి మృతి చెందినట్లు నిర్ధారించారు. అదే అంబులెన్స్‌లో తిరిగి కొత్తపేటలో ఆపరేషన్ చేసిన ఆస్పత్రికికి మృతదేహన్ని తీసుకువచ్చి ఆస్పత్రి ముందు బైఠాయించి, ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన చేశారు. అయితే పెద్దలు రంగప్రవేశం చేసి చర్చలు జరిపారు. కొంతసేపటికి ఆందోళన విరమించారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఏవిధమైన కేసు నమోదు కాలేదు.


