రహదారులా ఇవీ? | - | Sakshi
Sakshi News home page

రహదారులా ఇవీ?

Oct 5 2026 12:27 AM | Updated on Oct 5 2026 12:27 AM

● జిల్లాలో అవినీతి మరకలు

● రోడ్ల నిర్మాణంలో అవకతవకలు

● వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చిర్ల జగ్గిరెడ్డి

అయినవిల్లి: రహదారులా ఇవీ? కూటమి అవినీతికి మచ్చుతునకలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పి.గన్నవరం నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్‌ గన్నవరపు శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఈదరపల్లి బ్రిడ్జి నుంచి ముక్కామల, ఇందుపల్లి గరువు వరకూ నాసిరకంగా నిర్మించిన రోడ్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అవినీతిని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికే తాము ఈదరపల్లి బ్రిడ్జి నుంచి ముక్కామల వరకు ఉన్న రోడ్లను పరిశీలించామన్నారు. ఎన్‌కౌంటర్‌ బ్రిడ్జి నుంచి ఇందుపల్లిగరువుకు వెళ్లే రహదారిని ఉపాధి హామీ పథకం నిధులు రూ.12 కోట్లతో, అదేవిధంగా ముక్కామల నుంచి రోడ్డును రూ.11.50 లక్షలతో నిర్మించారన్నారు. ఈదరపల్లి బ్రిడ్జి నుంచి ముక్కామల, ఇందుపల్లి ప్రాంతంలోని రోడ్ల నిర్మాణంలో లోపాలతో కొద్ది కాలానికే దెబ్బతిన్నాయని తెలిపారు. రిటైనింగ్‌ వాల్‌ సహా రోడ్డు కుంగిపోయి, పెచ్చులూడుతున్నాయని ఆరోపించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులను ప్రజలకు ఉపయోగపడే ప్రధాన రహదారుల అభివృద్ధికి వినియోగించాల్సి ఉండగా, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తన వ్యాపార సంస్థలకు అనుకూలంగా రోడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పేరుతో పనులు చేపట్టి నెలల తరబడి పంట చేలకు నీరవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. సంబంధిత మంత్రులు, అధికారులు పనుల వద్దకు వచ్చి ఫొటోలు తీయించుకోవడం.. రీల్స్‌, వీడియోలు చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొన్నిచోట్ల వేసిన రోడ్లు, చేపట్టిన పనులు నాసిరకంగా ఉండటంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పగుళ్లతో దిగబడిన రోడ్డు వద్ద, దెబ్బతిన్న రిటైనింగ్‌ వాల్‌ వద్ద పసుపు చల్లి, ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. రోడ్ల నిర్మాణంలో అవకతవకలపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినా అధికారులు నెలల తరబడి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రూ.కోట్లతో నిర్మించిన రోడ్లు, రిటైనింగ్‌ వాల్స్‌ మూడు నెలలకు కుంగిపోయి, పెచ్చులూడుతుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు, అధికారులు మొద్దు నిద్రపోతున్నారని ఆరోపించారు. తాము వస్తున్నామని యుద్ధ పాతిప్రదికన తమ తప్పులు సరిదిద్దుకునేందుకు పనులు చేపట్టారన్నారు. ఇందుపల్లి రహదారి మూడు నెలల్లోనే దెబ్బతినడానికి కారణాలపై అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా రోడ్లు నిర్మించకుండా కొందరు కూటమికి చెందిన వ్యాపార సంస్థలకు గోడౌన్ల వరకు మాత్రమే రోడ్లు వేసి, సమీప కాలనీలకు రహదారి కల్పించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. పార్టీ ముమ్మిడివరం, రామచంద్రపురం, అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు చెల్లుబోయిన శ్రీనివాస్‌, కర్రి నాగిరెడ్డి, కటకంశెట్టి ఆదిత్య, నాయకులు కాశి మునికుమారి, మార్గాని గంగాధర్‌, అయినవిల్లి మండల శాఖ అధ్యక్షుడు మేడిశెట్టి శ్రీనివాస్‌, కుడుపూడి విద్యాసాగర్‌, కుడుపూడి భరత్‌ భూషణ్‌, వాసంశెట్టి తాతాజీ, మిండగుదిటి శిరీష్‌, తోరం గౌతమ్‌, దొమ్మేటి సత్యమోహన్‌, గొల్లకోటి ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement