అమలాపురం రూరల్: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో బుధవారం కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో మినీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఇంటర్వ్యూలు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతాయన్నారు. వికాస జిల్లా మేనేజర్ గోళ్ల రమేష్ మాట్లాడుతూ 19 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన లేదా చదువుతున్న అభ్యర్థులు అర్హులన్నారు.
అంతర్వేది ఆలయానికి
రూ.39 లక్షల ఆదాయం
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. ఈ ఏడాది మే 5 నుంచి జూలై 7వ తేదీ వరకూ 63 రోజులకు గాను వివిధ హుండీల ద్వారా రూ.39,92,538 వచ్చింది. అమలాపురం తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు పర్యవేక్షణలో హుండీల లెక్కింపు నిర్వహించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.38,79,902, గుర్రాలక్క అమ్మవారి గుడి హుండీ ద్వారా రూ.29,396, అన్నదానం హుండీల ద్వారా రూ.83,240 ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈవో ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ అన్నారు. ఎంపీటీసీ బైరా నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భూ రీసర్వేను
వేగవంతం చేయాలి
అమలాపురం రూరల్: భూ రీసర్వే, 22–ఏ నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, భూపరిపాలన ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి సంయుక్తంగా మంగళవారం విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో జిల్లాల వారీగా క్షేత్రస్థాయి పురోగతిని సమీక్షించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి జేసీ వైఖోం నైదియాదేవి, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇండస్ట్రియల్ పార్కు
ఏర్పాటు చేయాలి
అమలాపురం రూరల్: జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సుమారు 100 నుంచి 200 ఎకరాలను ప్రభుత్వం సేకరించి, పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం అమలాపురంలో మాట్లాడుతూ అవుట్ ఆఫ్ డేట్ అయిపోయిన క్వాయర్ పరిశ్రమల ఏర్పాటు వల్ల యువతకు ఏమీ ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని అనాతవరం వద్ద క్వాయర్ పరిశ్రమల ఏర్పాటుకు ఈ నెల 16, 17 తేదీల్లో కలెక్టర్ సదస్సు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలో రైతులు, యువతకు ఉపయోగం ఉండదన్నారు. ఆ పరిశ్రమలను గతంలోనే ఎంతో మంది రైతులు, వ్యాపారులు ఏర్పాటు చేసి నష్టపోయారన్నారు. చమురు అనుబంధ పరిశ్రమలైన గ్రీజ్, తారు వంటి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. చైన్నెలోని రీజనల్ ఉపాధి కార్యాలయాన్ని జిల్లాకు తీసుకురావాలని, పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆశా వర్కర్ల ఆందోళన
పిఠాపురం రూరల్: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విరవ, గొల్లప్రోలు పీహెచ్‌సీల వద్ద ఆశా వర్కర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోజువారీ అత్యవసర ఆరోగ్య విధులు నిర్వహిస్తున్న తమకు బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 5న ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, తమ యూనియన్ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన జీఓలు, సర్కులర్లు వెంటనే విడుదల చేయాలని, కోరారు. కనీస వేతనం అమలు చేయాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం ఈ నెల 31న జరగనున్న చలో కలెక్టరేట్ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.


