అప్పులు చేసి గొప్పలు | - | Sakshi
Sakshi News home page

అప్పులు చేసి గొప్పలు

Jun 21 2026 12:19 AM | Updated on Jun 21 2026 12:19 AM

అల్లవరం: అప్పులు చేసి గొప్పలు చెప్పుకొంటూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ ఎద్దేవా చేశారు. అమలాపురంలో శుక్రవారం జరిగిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సంపద సృష్టిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు.. రెండేళ్ల పాలనలో రూ. 3 లక్షల 56 వేల 650 కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఐదేళ్ల పాలనతో రూ.3 లక్షల 32 వేల కోట్ల అప్పు చేసి, వాటిలో డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ. 2 లక్షల 70 వేల కోట్ల నిధులతో సంక్షేమాన్ని ఖర్చు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయకపోయినా అప్పులు మాత్రం ప్రతి మంగళవారం చేసుకుంటూ పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ.18 వేలు, నిరుద్యోగ భృతి రూ.3 వేలు, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. 50 ఏళ్లు నిండిన వారికి, వితంతువులకు ఈ రెండేళ్ల కాలంలో ఒక్క పింఛనైనా మంజూరు చేశారా అని ప్రశ్నించారు. మద్యం ఏరులై పారుతున్నా, గంజాయి, మత్తు పదార్ధాలు విచ్చలవిడిగా అందుబాటులో ఉన్నా నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇసుక, మట్టి దందాను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఈ రెండేళ్ల కాలంలో చేసింది ఏమి లేకపోయినా విజయోత్సవాలు జరుపుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ మండిపడ్డారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement