● ఆటోను లారీ ఢీకొని ఇద్దరి మృతి
● ఘటన స్థలంలో మహిళ..
ఆస్పత్రిలో ఆటో డ్రైవరు..
● మరో ఐదుగురు మహిళలకు గాయాలు
సామర్లకోట/కొత్తపల్లి: స్థానిక కాకినాడ రోడ్డులోని ఐదు తూముల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉప్పాడ శివారు కొత్తపేటకు చెందిన ఆరుగురు మత్స్యకార మహిళలు, రామిశెట్టిపేటకు చెందిన ఎరిపల్లి ప్రేమకుమార్ (38) ఆటోలో ఉదయం మట్లపాలెంలో చేపలు కొనుక్కుని అక్కడి నుంచి సామర్లకోటలో విక్రయించేందుకు వస్తున్నారు. వారి ఆటోను తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట మీదుగా కాకినాడ వెళుతున్న లారీ ఐదు తూముల వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో గంపల చిట్టెమ్మ (35) అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన వారంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అడపా గరగారావు క్షతగాత్రులను ఆటోలో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమకుమార్ మృతి చెందాడు. కాగా గరికిన సింహాద్రి, రామిశెట్టి నాగమణి, వెరిపల్లి చిట్టెమ్మ, మేకల పోరిమేరీ, దొడ్డి సత్యవతి చికిత్స పొందుతున్నారు. వీరిలో గరికిన సింహద్రి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిట్టెమ్మ మృతదేహాన్ని పెద్దాపురం సీహెచ్‌సీకి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు.
ఉప్పాడలో విషాదఛాయలు
ఈ ప్రమాదంలో ఇద్దరు ఉప్పాడ వాసులు మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ ప్రేమకుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతడికి భార్య, కవల కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి మృతితో వారితో పాటు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా చిట్టెమ్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. చేపలు విక్రయంతో వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు కుమార్తెలకు వారు వివాహాలు చేశారు. కొంతకాలంగా చేపల వ్యాపారం మానేసిన ఆమె ఇటీవల 15 రోజులుగా వ్యాపారానికి వెళ్తోంది. ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.


