శబరిలో మునిగి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

శబరిలో మునిగి మహిళ మృతి

May 28 2026 12:22 AM | Updated on May 28 2026 12:22 AM

చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్‌ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్‌టెల్‌ టవర్‌ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్‌కుమార్‌ తెలిపారు.

రైలు ఢీకొని వ్యక్తి..

నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్‌ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్‌ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్‌ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్‌సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

పాముకాటుకు గురై..

రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్‌రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

పోక్సో కేసు నమోదు

దేవరపల్లి: నల్లజర్ల పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్‌ కుమార్‌పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్‌ తెలిపారు.

బాలుడి అక్రమ రవాణాకు చెక్‌

కిడ్నాప్‌కు గురైన

పశ్చిమబెంగాల్‌ బాలుడు

రక్షించి తండ్రికి

అప్పగించిన అధికారులు

కాకినాడ క్రైం: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ రవాణాకు గురైన 16 ఏళ్ల బాలుడ్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సిబ్బంది, తుని రైల్వే పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే, ఓ గుర్తు తెలియని యువకుడు బాలుడికి మాయమాటలు చెప్పి ఈ నెల 24న పశ్చిమబెంగాల్‌లో రైలు ఎక్కించాడు. రైలు రాష్ట్రం సరిహద్దులు దాటే సరికి బాలుడికి భయం మొదలైంది. 25న ఆంధ్రప్రదేశ్‌లో తుని రైల్వేస్టేషన్‌కి చేరేసరికి రైలులో సాధారణ తనిఖీలు చేస్తున్న జీఆర్‌పీ సిబ్బంది బాలుడి అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించి వివరాలు ఆరా తీశారు. ఈ లోగా బాలుడిని తీసుకువచ్చిన యువకుడు పరారయ్యాడు. బాలుడి విషయాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారి చదలవాడ వెంకట్రావుకు తెలియజేశారు. ఆయన జిల్లా పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, బాలుడి చిరునామాను గుర్తించి తండ్రి హరిద్దీన్‌ను పిలిపించి అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement