అనపర్తి: విద్యుత్ తీగ తెగిపడి ఎండు గడ్డి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 1200 ఎండు గడ్డి టెక్కీలు దగ్ధమైనట్టు బాధిత రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ లైన్‌కు సంబంధించిన తీగ తెగి రోడ్డు పక్కన నిల్వ ఉంచిన గడ్డి టెక్కీలపై పడడంతో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వీటిలో కొర్ల శ్రీనివాస్‌కు చెందిన ఐదు వందల టెక్కీలు, మందనక్క సత్యనారాయణకు చెందిన 300, కోరాడ రాఘవ 180, మహిపాల చంద్రరావుకు చెందిన 190 టెక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.
అమ్మమ్మను హత్య చేసిన మనవడికి యావజ్జీవ జైలు
తొండంగి: దురలవాట్లకు బానిసైన మనుమడు మద్యం మత్తులో డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన కేసులో మనుమడికి యావజ్జీవ శిక్ష పడిందని సీఐ చెన్నకేశవరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దానవాయిపేట పంచాయతీ నర్శిపేటకు చెందిన బెనుగు దీనమ్మ (75)ను మనుమడు గోసల జాన్ 2025 జూలై 12న మద్యం మత్తులో డబ్బులు ఇవ్వాలని గొడవపడి హత్య చేశాడు. ఈ ఘటనపై దీనమ్మ కుమార్తె, జాన్ తల్లి గోసల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిఠాపురం ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జాన్‌కు జడ్డి పి.భాస్కరరావు యావజ్జీవ శిక్ష విధించారన్నారు.


