స్విమ్ముతున్న విషాదం | - | Sakshi
Sakshi News home page

స్విమ్ముతున్న విషాదం

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

పోలీసు గణాంకాల ప్రకారం

గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాలు

సంవత్సరం కేసులు మృతులు

2021 54 59

2022 63 67

2023 71 78

2024 78 80

2025 39 53

2026 37

(ఇప్పటి వరకూ)

మొత్తం 308 345

ప్రవహిస్తున్న నదిని చూస్తే మనస్సు ఇనుమడించిన ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతుంది. ఉవ్వెత్తున అలలు ఎగసిపడే అపార జలనిధిని చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది. మండే ఎండాకాలంలో.. పాఠశాలలకు సెలవులు వచ్చిన వేళ.. ఆ ఝరిలో కేరింతలు కొడుతూ జలకాలాడాలనే ఉత్సాహం పొంగి పొరలుతుంది. అయితే, తెలియని నదీ తావుల్లో సరదాగా ఈతకు దిగే వేళ లోపిస్తున్న అప్రమత్తత.. పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది.

రావులపాలెం వద్ద గౌతమీ గోదావరిలో గల్లంతైన వారి కోసం పడవలపై గాలింపు (ఫైల్‌)

ఆలమూరు: వేసవి ఎండల తీవ్రత నానాటికీ అధికమవుతోంది. మరోవైపు పరీక్షా కాలం కూడా ముగిసింది. దీంతో, విద్యార్థులు, యువతలో ఆటవిడుపు మొదలైంది. పర్యాటకుల్లో సందడి షురూ అయ్యింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. ఉమ్మడి జిల్లాలో 289 కిలోమీటర్ల మేర ప్రవహించే గోదావరి పాయల్లో పలు ప్రదేశాలు ఆహ్లాదకరంగా కనువిందు చేస్తూంటాయి. గోదావరి, సాగర తీరాలతో పాటు మన్యసీమ అందాలు సైతం పర్యాటకులను కట్టి పడేస్తూంటాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని కన్నులారా వీక్షించేందుకు.. ఆ ప్రదేశాల్లో సేద తీరేందుకు అనేక మందిలో ఉత్సాహం ఉరకలేస్తోంది. గోదావరి పరిసర ప్రాంత వాసులే కాకుండా స్థానికులతో పాటు వారి బంధువులు, స్నేహితులు, పర్యాటకులు సైతం ఉల్లాసభరిత వాతావరణంలో గడిపేందుకు తహతహలాడుతూంటారు. ముఖ్యంగా సాగర తీరంలోను, నదులు, సెలయేళ్లలో స్నానాలు చేసేందుకు పలువురు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ ఈత సరదా సంగతి ఎలా ఉన్నా.. తెలియని చోట్ల స్నానాలకు, ఈతకు దిగే సమయంలో ఏమాత్రం జాగ్రత్తగా లేకపోయినా.. ఎక్కడ లోతు ఉందో, ఎక్కడ ఊబి ఉందో తెలియక.. మృత్యుఘాతానికి బలయ్యే పరిస్థితులు పొంచి ఉంటాయి. ఏటా గోదావరి, సముద్ర తీరాల్లో లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అయినవారి గుండెల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు. మరోవైపు కొంత మంది ఆచూకీ సైతం లభ్యం కాక ఇప్పటికీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

ఈ చర్యలు.. తీసుకుంటే మేలు

ఫ గోదావరి నదీ తీరాల్లో ప్రమాదాల నివారణకు పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌ హెడ్‌వర్క్స్‌, పోలీసు శాఖలు ప్రత్యేకంగా పటిష్ట చర్యలు చేపట్టాలి. పరీవాహక ప్రాంతంలో పోలీసు గస్తీ ముమ్మరం చేయాలి. అవగాహన సదస్సులు నిర్వహించాలి.

ఫ వేసవిలో గోదావరి తీరంలోకి ఇతర ప్రాంతాల వారు వస్తే ఆయా గ్రామాల పంచాయతీ సిబ్బంది ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇవ్వాలి.

ఫ నదీ తీరంలోని అన్ని ప్రమాదకరమైన రేవుల వద్ద లోతు వివరాలు తెలియజేసేలా హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలి.

ఫ గోదావరి నదీ పరీవాహక గ్రామాల్లో అనుమతి లేని ప్రదేశాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాంతాల్లో ఈత, స్నానాల వలన కలిగే అనర్థాలను వివరించే ప్రయత్నం చేయాలి.

ఫ అలాగే, స్నానాలు చేసేటప్పుడు, ఈత కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ స్వీయరక్షణ చర్యలు పాటించాలి. ముఖ్యంగా లైఫ్‌ జాకెట్లు ధరించడం మేలు.

ఫ అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన అధికారుల ఫోన్‌ నంబర్లను ఆయా ప్రాంతాల్లో ప్రదర్శించాలి.

అక్కడ స్నానాలు వద్దు

గోదావరి తీరం వెంబడి అనుమతి లేని ప్రదేశాల్లో ఎవ్వరూ స్నానాలకు దిగవద్దు. ఇప్పటికే తీరం వెంబడి గుర్తించిన ప్రమాదకరమైన ప్రాంతాల్లో హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్థానికుల సహకారంతో ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తున్నాం. రద్దీ ప్రదేశాల్లో పోలీసు గస్తీ ముమ్మరం చేశాం. పర్యాటక ప్రాంతాల్లో నిరంతరం పోలీసు పహరా ఏర్పాటు చేస్తున్నాం.

– సుంకర మురళీ మోహన్‌, డీఎస్పీ, కొత్తపేట

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా గత 11 ఏళ్లలో జరిగిన కొన్ని ముఖ్య

ప్రమాదాలు, మృతుల వివరాలు

తేదీ ప్రమాద ప్రదేశం మృతులు

2015 మార్చి 3 మూలస్థాన అగ్రహారం 3

2015 మే 3 జొన్నాడ 2

2015 మే 3 మూలస్థాన అగ్రహారం 2

2018 జూలై 24 శేరిలంక (పడవ ప్రమాదం) 4

2019 ఏప్రిల్‌ 19 బడుగువానిలంక 2

2020 జూన్‌ 2 బడుగువానిలంక 2

2022 మార్చి 20 బడుగువానిలంక 2

2023 ఏప్రిల్‌ 14 కూళ్ల 3

2023 మే 25 మద్దూరులంక 2

2023 జూన్‌ 27 వద్దిపర్రులంక 2

2024 మే 12 వాడపల్లిలంక 3

2024 మే 18 రావులపాలెం 3

2025 మార్చి 24 తాడిపూడి 5

2025 మార్చి 27 రాజమహేంద్రవరం 2

2025 ఏప్రిల్‌ 12 ఏలేరు కాలువ 4

2025 ఏప్రిల్‌ 15 కూళ్ల 3

2025 మే 26 సలాదివారిపాలెం 8

2026 పిచ్చుకలంక 3

ఫ కన్నీళ్లు మిగుల్చుతున్న ఈత సరదా

ఫ ఈ ఏడాది మూడు ప్రమాదాలు.. ఏడుగురి మృతి

ఫ గత ఐదేళ్లలో 308 ప్రమాదాలు

ఫ 345 మంది మృత్యువాత

ఫ తెలియని తావుల్లో అప్రమత్తతే శ్రీరామరక్ష

ప్రమాదకర తావులివిగో..

ఫ ఉమ్మడి జిల్లాలో ప్రమాదకరమైన ప్రాంతాలు అనేకం ఉన్నాయి.

ఫ కోనసీమ జిల్లాలో గోదావరి తీరాన ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక, కె.గంగవరం మండలం శేరిలంక, ముమ్మిడివరం మండలం సలాదివారిపాలెంతో పాటు అంతర్వేది, ఓడలరేవు సాగర తీరాలు అత్యంత ప్రమాదకరమైనవని గత సంఘటనలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 4న పిచ్చుకలంకలో జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరం జాంపేటకు చెందిన యువకులు మృత్యువాత పడ్డారు.

ఫ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులంక, సీతంపేట, విజ్జేశ్వరం లాకులు.

ఫ కాకినాడ జిల్లాలో ఏలేరు నదితో పాటు కాకినాడ, ఉప్పాడ సముద్ర తీరాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఉప్పాడ వద్ద తరచుగా రాకాసి అలలు విరుచుకుపడుతూంటాయి.

ఫ పోలవరం జిల్లా మన్యసీమలో పింజరికొండ, పాములేరు అత్యంత ప్రమాదకరంగా పేరొందాయి.

ఫ ఈ ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుని, ఎక్కువగా ప్రాణనష్టం సంభవిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో 308 ప్రమాదాలు జరుగగా 345 మంది మృత్యువాత పడ్డారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవి రికార్డుల్లోకి ఎక్కినవి. అలా అధికారిక లెక్కల్లోకి రాకుండా ఉన్న మృతుల సంఖ్య మరింత అధికంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు ఆయా ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనివ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement