సమానత్వ సాధనకు జగ్జీవన్‌రామ్‌ కృషి | - | Sakshi
Sakshi News home page

సమానత్వ సాధనకు జగ్జీవన్‌రామ్‌ కృషి

Apr 6 2026 8:00 AM | Updated on Apr 6 2026 8:00 AM

రావులపాలెం: దేశానికి, సమాజంలో సమానత్వ సాధనకు, దళిత హక్కుల పరిరక్షణకు మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ చేసిన కృషి అపారమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెలే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆ మహనీయుని ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు. రావులపాలెంలోని వైఎస్సార్‌ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమర యోధుడిగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప నాయకుడిగా జగ్జీవన్‌రామ్‌ గుర్తుండిపోతారని అన్నారు. కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని, వ్యవసాయ రంగంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు రైతులకు ఎంతో మేలు చేశాయని వివరించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్న కుమార్‌, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్‌ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ బొక్కా కరుణాకరం, ఎస్సీ సెల్‌ సీనీయర్‌ నాయకులు కప్పల శ్రీధర్‌, కోనాల రాజు తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తిదాయకం.. జగ్జీవన్‌రామ్‌ జీవితం

అమలాపురం రూరల్‌: సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్‌లో ఆదివారం జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో జన్మించి ఉప ప్రధాని స్థాయికి జగ్జీవన్‌రామ్‌ ఎదిగారన్నారు. భారత్‌ – పాక్‌ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా ఆయన నాయకత్వంలో మన సైన్యం చరిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమానికి అనేక చట్టాలు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌, పరిపాలనాధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో డీటీఓ రామనాథం, డీవీఎంసీ సభ్యులు హాస్టల్‌ విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు

చిర్ల జగ్గిరెడ్డి

ఫ రావులపాలెంలో

ఘనంగా జయంతి వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement