తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి పుట్టింటి సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. లోవ దేవస్థానంలో గరగలను శిరస్సుపై అధిష్టించి వార్షిక జాతరను ఈఓ పి.విశ్వనాథరాజు, మాజీ చైర్మన్ దూలం మాణిక్యం, ప్రధానార్చకులు సంప్రదాయ నృత్యాలతో ప్రారంభించారు. గత సంవత్సరం లోవ కొత్తూరులో భద్రపరచిన అమ్మవారి గరగలను కళాకారులు, గ్రామస్తులు ఆదివారం లోవ దేవస్థానానికి తీసుకువెళ్లి పుట్టధార నుంచి జాలువారే పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అమ్మవారి ప్రధాన గర్భాలయంలో ఉంచి ప్రధానార్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన వస్త్రాలతో గరగలను అలంకరించి ఈఓ, మాజీ చైర్మన్ శిరస్సులపై ఉంచుకుని నృత్యాలు చేశారు. అనంతరం, మేళతాళాలు, కోలాటాలు, డప్పు వాయిద్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ తలుపులమ్మ అమ్మవారి గరగలను ఊరేగింపుగా లోవకొత్తూరు గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాన్పుపై ఆ గరగలను ఉంచి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ విశ్వనాథరాజు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గంధామావాస్య సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి లోవకొత్తూరులో పుట్టింట 13 రోజులు జాతరోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. 16న జాగరణోత్సవం, 17న తీర్థం, అమ్మవారి ఊరేగింపు, భక్తులు అమ్మవారి దర్శనాలతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. జాతరోత్సవాలను పురస్కరించుకుని 16, 17 తేదీల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.


