అల్లవరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి లక్షల మంది వలంటీర్ల కడుపుకొట్టారన్నారు. ఇప్పుడు సచివాలయాల్లో సిబ్బందిని కుదించేస్తున్నారని, ఉన్న కొద్దిపాటి సిబ్బందినీ జిల్లా కార్యాలయాల్లో డిప్యూటేషన్‌పై బదిలీ చేసి క్షేత్రస్థాయిలో పౌర సేవలకు విఘాతం కలిగిస్తున్నారన్నారు. సచివాలయాల్లో 540 సర్వీసులను గత ప్రభుత్వం ప్రారంభిస్తే నేడు చాలా తక్కువ సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ వచ్చే నాటికి అల్లవరం మండలంలో సూమారు 390 మంది సిబ్బందిని నియమిస్తే, నేడు కేవలం 170 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలం ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం స్పందించి డిప్యూటేషన్‌లో ఉన్న సిబ్బంది యథాతథంగా ఆయా మండలాలకు బదిలీ చేయాలని అనురాధ డిమాండ్ చేశారు.


