పి.గన్నవరం: మండలంలోని బెల్లంపూడి గ్రామంలో ఇటీవల మూసివేసిన ఓఎన్‌జీసీ బావి క్రిస్మస్ ట్రీ వాల్వ్ నుంచి బుధవారం సాయంత్రం స్పల్పంగా గ్యాస్ లీకవుతున్నట్టు శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. అయితే ఈ బావిని మడ్‌తో మూసివేశామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రొడక్షన్ జీఎం వైఎన్ రావు తెలిపారు. వివర్లాలోకి వెళితే.. బెల్లంపూడి ఓఎన్‌జీసీ సైట్‌లో సుమారు 3,800 మీటర్ల మేర డ్రిల్లింగ్ జరిపారు. అక్కడ తక్కువ మొత్తంలో గ్యాస్ నిల్వలు ఉన్నాయని గుర్తించారు. అయితే అక్కడి నుంచి పాశర్లపూడి సైట్‌కు గ్యాస్ మళ్లించేందుకు పైపులైన్లు నిర్మించలేదు. దీంతో ఆ బావిని మడ్‌తో తాత్కాలికంగా మూసివేసి, పైన క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అనంతరం గత నెల 6న రిగ్‌ను ఇక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న సైటుకు బుధవారం సాయంత్రం స్థానిక యువకులు ఆడుకునేందుకు వెళ్లగా, బోల్టు వద్ద గ్యాస్ లీకేజీ అవుతున్నట్టు శబ్దం రావడంతో అధికారులకు సమాచారం అందించారు.
ఆందోళన వద్దు : కలెక్టర్
బెల్లంపూడి ఓన్‌జీసీ సైటులో స్వల్ప గ్యాస్ లీకేజీపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా నియంత్రణలోనే ఉందని కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రకటనలో తెలిపారు. అది మూసివేసిన ఓఎన్‌జీసీ బోరు బావి అని, ఎటువంటి పైపులైన్లు లేకుండా ఉన్నదన్నారు. దాని నుంచి చాలా నెమ్మదిగా స్వల్పంగా గ్యాస్ లీకవుతోందన్నారు. లీకేజీని అరికట్టేందుకు అమలాపురం, రాజోలుకు చెందిన రెండు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని, రెస్క్యూ బృందం కూడా రానున్నదన్నారు. కొన్ని గంటలలో లీకేజీ పూర్తిగా ఆగిపోతుందని, ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.


