● ప్రముఖ ఆలయాల్లో
అన్నదానానికి గ్యాస్ సెగ
● వందలాది మందికి ప్రసాదాల పంపిణీ
● గ్యాస్ కొరతతో సిబ్బందికి ఇబ్బందులు
● ప్రత్యామ్నాయంగా
స్టీమ్, కట్టెలతో వంటకాలు
సాక్షి, అమలాపురం: ‘గ్యాస్’ సెగ.. సామాన్యులకే కాదు.. దేవునికి కూడా తాకింది. పశ్చిమ ఆసియాలో యుద్ధ తీవ్రత పెరిగే కొద్దీ స్థానికంగా గ్యాస్ కష్టాలు రెట్టింపవుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపి వేయడంతో తోపుడు బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్‌లతో పాటు పలు రకాల వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా గ్యాస్ సెగ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను తాకింది. ఈ దేవాలయాల వద్ద రోజూ క్రమం తప్పకుండా వందలాది మంది భక్తులకు భోజనం, ప్రసాదాలు అందించేందుకు గ్యాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేక దేవస్థానం అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ పద్ధతిలో స్టీమ్ కుక్కర్లు, కట్టెల పొయ్యిలపై అన్న ప్రసాదాలు తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు.
● ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. రోజూ ఇక్కడ సుమారు మూడు, నాలుగు వేల మంది వరకూ భోజనాలు చేస్తారు. ఇక ప్రతి శనివారం సుమారు 35 వేల మందికి భోజనాలు అందించాల్సి ఉంది. ఇది కాకుండా ప్రసాదం రూపంలో లడ్డూ, పులిహోర అందిస్తుంటారు. వీటిని పూర్తిగా గ్యాస్‌పై తయారు చేయాలి. గతంలో తమిళనాడులోని కోయింబత్తూరు నుంచి స్టీమ్ యూనిట్ తీసుకువచ్చారు. ఇది తెచ్చి 15 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు జనాభా పది రెట్లు పెరిగింది. దేవాలయాలకు క్రమం తప్పకుండా కమర్షియల్ సిలిండర్లు అందించాలని అధికారులు చెబుతున్నా, అవి ఆయా ఆలయాల వద్ద అవసరాలకు సరిపోవడం లేదు. దీనితో స్థానిక దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై భోజనం, ప్రసాదాలు తయారు చేయిస్తున్నారు. ఇందుకు అష్టకష్టాలు పడుతున్నారు. శనివారం పెద్ద ఎత్తున వచ్చిన భక్తులకు సరిపడినంత భోజనం అందించేందుకు కట్టెల పొయ్యిల వద్ద తీవ్రంగా శ్రమపడాల్సి వచ్చిందని వంట సిబ్బంది చెబుతున్నారు.
● ఐ.పోలవరం మండలం వీరేశ్వరస్వామి ఆలయంలో సైతం గ్యాస్ కొరత కారణంగా దేవస్థానం సిబ్బంది కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. రోజూ ఇక్కడ రాత్రి సమయాల్లో జరిగే కల్యాణాలకు హాజరైన సుమారు 700 మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదం అందజేస్తారు. గ్యాస్ కొరత నేపథ్యంలో సోమవారం నుంచి కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేశారు. అన్నంతో పాటు కూరలు, సాంబారు తదితర పదార్థాలను కట్టెల పొయ్యిలపైనే చేస్తున్నారు.
● అంతర్వేది లక్ష్మీనృసింహుని ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి గ్యాస్ ఇబ్బందులు లేవు. ఇక్కడ ఎప్పటి నుంచో స్టీమ్‌పై పనిచేసే కుక్కర్, ఇతర వస్తువులతో వంటలు చేస్తున్నారు. వాటితో ఇక్కడ అన్నం సిద్ధం చేస్తున్నారు. వంటలకు కేవలం 25 శాతం మాత్రమే గ్యాస్ వినియోగిస్తుండగా, మిగిలిన 75 శాతం స్టీమ్ సిస్టమ్ పైనే ఆధారపడుతున్నారు. ఇక్కడ స్టీమ్ సిస్టమ్ జీడి పిక్కల పొయ్యిలతో పనిచేస్తున్నాయి. రోజుకు రెండు సిలిండర్ల చొప్పున నెలకు 62 సిలిండర్లు అవసరం పడుతున్నాయి. ప్రస్తుతం కొరత లేకున్నా ముందు ముందు గ్యాస్ ఇక్కట్లు తప్పేటట్టు లేదు.
● రామచంద్రపురం మండలం ద్రాక్షారామలోని భీమేశ్వరస్వామి ఆలయం వద్ద రోజూ 600 నుంచి 800 మంది వరకూ అన్నప్రసాదం అందిస్తున్నారు. ఆదివారం వెయ్యి మంది వరకూ ఉంటున్నారు. ప్రస్తుతం గ్యాస్‌కు ఇబ్బంది లేకున్నా.. ప్రత్యామ్నాయంగా కట్టెలను సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక ఏజెన్సీ నుంచి గ్యాస్ వస్తున్నా పూర్తి స్థాయిలో సరిపోవడం లేదు.
● అయినవిల్లి వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద రోజూ సుమారు 1,500 మంది వరకూ భోజనం చేస్తారు. ఆదివారం సుమారు 2,500 మంది, పండగల సమయంలో ఐదు వేల మంది వరకు ఉంటారు. ప్రస్తుతానికి గ్యాస్ ఇబ్బంది లేదని చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా సాంబారు వంటి ఆహార పదార్థాలు పొయ్యిలపై కానిచేస్తున్నారు. అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయంలో శని, ఆదివారాలు సుమారు 3,500 మంది చొప్పున భోజనం చేస్తారు. ఇక్కడ గ్యాస్ మీద వంటలు తక్కువ. ప్రత్యేకంగా జీడి పప్పు చెక్కను వంట చెరకుగా వినియోగిస్తుండడం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. ధూపదీప నైవేద్యాలకు, లడ్డూ ప్రసాదం గ్యాస్‌పై వండుతారు. ఇందుకు నెలకు 60 సిలిండర్లు అవసరం కాగా, కేవలం 15 మాత్రమే అందించారు. దీంతో సిబ్బందికి గ్యాస్ ఇబ్బందులు తప్పడం లేదు.
వాడపల్లి వెంకన్న ఆలయంలో అన్న ప్రసాదాన్ని కట్టెల పొయ్యిలపై సిద్ధం చేస్తున్న సిబ్బంది


