కార్మిక చట్టాలను పునః సమీక్షించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మిక చట్టాలను పునః సమీక్షించాలి

Mar 22 2026 1:35 AM | Updated on Mar 22 2026 1:35 AM

4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ఏఐటీయూసీ జిల్లా ప్రథమ

మహాసభల డిమాండ్‌

అమలాపురం టౌన్‌: కార్మిక చట్టాలను సవరణ చేయడంతో పాటు పునః సమీక్షించాలని, 4 లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రథమ మహాసభలు డిమాండ్‌ చేశాయి. అమలాపురం ప్రెస్‌క్లబ్‌ భవనంలో రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఏఐటీయూసీ జిల్లా మహాసభలు తొలి రోజు శనివారం పలు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించాయి. ఏఐటీయూసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు పర్యవేక్షణలో జరిగిన ఈ మహాసభలకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలం వెంకట సుబ్బయ్య, రాష్ట్ర కోశాధికారి బీవీవీ కొండలరావు, జాతీయ సమితి సభ్యుడు తోకల ప్రసాద్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. తొలుత సభా ప్రాంగణం వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి సీపీఐ జిల్లా కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్టీయూ రాష్ట్ర నాయకుడు ఎంఎస్‌ఎన్‌ మూర్తి నిర్వహణలో సభ జరిగింది. అంతకు ముందు ఏఐటీయూసీ జిల్లా ప్రథమ సభల జెండాను జట్టు లేబర్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కురచ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం ప్రెస్‌క్లబ్‌ భవనం నుంచి స్థానిక గడియారం స్తంభం సెంటరు వరకూ పలు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్ల సాధన కోసం పెద్దపెట్టున నినాదాలు చేశారు. ‘యుద్ధం వద్దు...శాంతి ముద్దు’ అనే నినాదాన్ని హోరెత్తించారు. ప్రదర్శన తిరిగి సభా స్థలికి చేరుకుంది. సభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ కార్మికుల కనీస వేతనం రూ.26 ఉండాలని, ఆటో కార్మికులకు, జట్ల లేబర్‌కు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలని, మహిళా కార్మికుల హక్కులను పరిరక్షించాలని మహా సభల్లో మాట్లాడిన వక్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఉద్యోగుల పీఆర్సీ కమిటీ వేయాలని, కోనసీమ జిల్లా సమగ్రాభివృద్ధికి కార్యాచరణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. మన గ్యాస్‌ మనకే అనే నినాదంతో 50 శాతం మన రాష్ట్రానికి కేటాయించే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా ఏఐటీయూసీ నివేదికను సభల్లో ప్రవేశపెట్టి సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం 31 మందితో ఏఐటీయూసీ నూతన కౌన్సిల్‌ ఏర్పాటైంది. ఆదివారం జరిగే రెండో రోజు జిల్లా మహా సభల్లో నూతన ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక జరగనుంది. సభల్లో ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు దొరబాబు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ప్రతినిధులు పలివెల సత్తిబాబు, పసుపులేటి సుబ్బారావు, అమలాపురం, రామచంద్రపురం బార్‌ అసోసియేషన్ల అధ్యక్షులు చింతపల్లి అజయ్‌కుమార్‌, ఉండవల్లి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement