పి.గన్నవరం: టిప్పర్ ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఊడిమూడి గ్రామానికి చెందిన రైతు విళ్ల నాగేశ్వరరావు (63) శనివారం మధ్యాహ్నం పశువులను మేపేందుకు సైకిల్‌పై లంకలోకి వెళ్లాడు. రాత్రి 7 గంటల సమయంలో అక్కడి నుంచి ఇంటికి సైకిల్‌పై వస్తున్నాడు. ఏటిగట్టు ర్యాంపు వద్ద సైకిల్‌ను నడిపించుకుంటూ పైకి ఎక్కుతున్నాడు. అదే సమయంలో లంక నుంచి మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ని ఏటిగట్టుపైకి ఎక్కించే క్రమంలో డ్రైవర్ రివర్స్ చేస్తున్నాడు. పైకి వస్తున్న నాగేశ్వరరావును గమనించకుండా టిప్పర్‌తో వెనుక నుంచి ఢీకొన్నాడు. వృద్ధుడిపై నుంచి టిప్పర్ వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అనంతరం టిప్పర్‌ను ఆపకుండా డ్రైవర్ లంకలోకి తిరిగి వెళ్లి మట్టిని అన్‌లోడ్ చేసి పరారయ్యాడు. దీంతో గ్రామస్తులు ఆర్‌పీ రోడ్డుపైకి వచ్చి మృతునికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై బి.శివకృష్ణ ప్రమాద స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ప్రమాదకరంగా మారినా..
ఊడిమూడిలంక నుంచి వస్తున్న మట్టి టిప్పర్లను కొందరు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతున్నారని పలువురు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన వేగంతో నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను నిలిపివేయాలని అన్నారు.


