నాటక రంగానికి ప్రోత్సాహం ఎనలేనిది | - | Sakshi
Sakshi News home page

నాటక రంగానికి ప్రోత్సాహం ఎనలేనిది

Mar 22 2026 1:35 AM | Updated on Mar 22 2026 1:35 AM

సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు

చివరి రోజు ఆకట్టుకున్న నాటికలు

రావులపాలెం: భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిటన్‌ రిక్రియేషన్‌ క్లబ్‌ (సీఆర్‌సీ) ఆధ్వర్యంలో నాటక రంగానికి అందిస్తున్న ప్రోత్సాహం ఎనలేదని సినీ నటులు తనికెళ్ల భరణి, గౌతంరాజు అన్నారు. స్థానిక సీఆర్‌సీ కళావేదికలో నిర్వహిస్తున్న 26వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు విశేషంగా అలరిస్తున్నాయి. మూడో రోజు శనివారం నాటికలను సీఆర్‌సీ కార్యదర్శి నల్లమిల్లి వీరాఘవరెడ్డి, నాటక పరిషత్‌ డైరెక్టర్‌ కె.సూర్య, డైరెక్టర్‌ నడింపల్లి వెంకట సుబ్బరాజు వర్మ ప్రారంభించారు. ఈ నాటికలను తనికెళ్ల భరణి, గౌతంరాజు తిలకించారు. ఎస్వీ రంగారావు కళా స్రవంతి కాకినాడ వారు ప్రదర్శించిన ఆచమనం నాటిక మనసు హత్తుకుంది. దీనికి రచనా, దర్శకత్వం పి.వెంకన్నబాబు వహించారు. రాధా, కృష్ణలు భార్యాభర్తలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన కృష్ణ పిల్లల చదువు కోసం రూ. 30 లక్షల అప్పు చేస్తాడు. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. దీంతో మావయ్య కొండల రాయుడు అల్లుడు కృష్ణకు ఎల్‌ఐసీ ఆఫర్‌ చెప్పి చనిపోమని ప్రేరేపిస్తాడు. దీంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన కృష్ణను సహచరుడైన ఆటోవాలా రక్షిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణ భార్య రాధ తన తండ్రిని నిలదీసి అసహ్యించుకుంటుంది. భర్తకు అండగా నిలుస్తూ అప్పుల నుంచి బయటపడేలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దీంతో ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకోవాలంటే భార్యా, పిల్లలు, కుటుంబం గుర్తుకు రావాలని కృష్ణ చిన్నాన్న రామస్వామి హితబోధ చేస్తాడు. వారి స్ఫూర్తితో అప్పులు తీరుస్తాడు. ఈ కథాంశంతో ఆచమనం నాటిక ఆకట్టుకుంది.

సందేశాత్మకంగా దొందుదొందే..

విశాఖపట్నం భద్రం ఫౌండేషన్‌ వారి దొందుదొందే నాటిక సందేశాత్మకంగా సాగింది. దీనికి రచన, దర్శకత్వం ఎస్‌.డేవిడ్‌రాజు వహించారు. 40 ఏళ్ల పైబడిన ఒక లావుపాటి పెద్ద పొట్ట కలిగిన వ్యక్తికి తనకున్న మరో ప్రధాన లోపం వల్ల పెళ్లి జరగదు. చివరకు పెళ్లిళ్ల పేరయ్య చనువుతో ఒక సంబంధం కుదురుతుంది. అయితే తనకున్న లోపాన్ని ముందుగానే తన అత్తింటి వారికి చెప్పాలని పెళ్లికొడుకు తన తాతకి చెప్తాడు. అయితే చెవులు సరిగా వినపడని తాత ఆ విషయాన్ని అమ్మాయి బంధువులకు చెప్పడం మర్చిపోతాడు. చివరకు అమ్మాయితో వివాహం జరుగుతుంది. అయితే పెళ్లయిన మర్నాడు మొదటి రాత్రికి బదులు మొదటి పగలు జరిపించాలని పెళ్లి కొడుకు తన అత్తింటి వారిని కోరతాడు. అలా మొదటి రాత్రికి బదులుగా మొదటి పగలు జరపటం హిందూ సంప్రదాయం కాదని, ఆ సంస్కృతి మనకు లేదని అత్తింటి వారు సున్నితంగా తిరస్కరించి నవ దంపతుల్ని మొదటి రాత్రికి సిద్ధం చేస్తారు. ఈలోగా తనకున్న లోపాన్ని ముందుగానే తన భార్యకు చెప్పాలని ఉద్దేశంతో మాట్లాడడానికి పెరట్లోకి రమ్మంటాడు. అయితే తనకు రేచీకటి ఉందన్న విషయాన్ని తల్లిదండ్రులు దాచిపెట్టి పెళ్లి జరిపించారని పెళ్లికూతురు చెబుతుంది. దాంతో ఆగ్రహించిన పెళ్లికొడుకు అత్తామామను పిలిచి గొడవ పడతాడు. ఆ గొడవలో అల్లుడికి కూడా రేచీకటి ఉందన్న విషయాన్ని అందరూ గ్రహిస్తారు. అయితే నాకు పెళ్లొద్దని గొడవ పడుతున్న అల్లుడితో....‘లోపాలనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయని, వాటిని భూతద్దంలో చూస్తూ.. సంసారాలు చిన్నాభిన్నాం చేసుకోకూడదని, ఇద్దరూ సర్దుకుపోండి.. ‘దొందూ– దొందే’ అని నచ్చచెప్పడంతో అతనిలో మార్పు వచ్చి నాటిక ముగుస్తుంది. అనంతరం రావులపాలెం సీఆర్‌సీ వారి ప్రత్యేక ప్రదర్శనగా బండారులేడి నాటికను ప్రదర్శించారు. దీనికి రచన సీఆర్‌సీ రూపశిల్పి డాక్టర్‌ గొలుగూరి వెంకటరెడ్డి, దర్శకత్వం గంటా రామమోహన్‌రావు వహించారు. చివరి రోజు నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏర్పాట్లను సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, నాటక కళా పరిషత్‌ డైరెక్టర్‌ కె.సూర్య, పరిషత్‌ పర్యవేక్షణ డైరెక్టర్‌ పలివెల త్రిమూర్తులు, డైరెక్టర్లు సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్నబుజ్జి), నడింపల్లి వెంకట సుబ్బరాజువర్మ, మల్లిడి విజయభాస్కరరెడ్డి, మల్లిడి అంజనీకుమార్‌రెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి తదితరులు పర్యవేక్షించారు.

ఆచమనం నాటికలో ఓ సన్నివేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement