సాక్షి, అమలాపురం: గుంతలు లేని రోడ్లు.. గోతులు లేని రోడ్లు.. కొత్త కొత్త రోడ్లు.. సాఫీగా సాగిపోయే ప్రయాణం అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకూ, చోటా నాయకుడి నుంచి రాష్ట్ర మంత్రుల వరకూ ఊకదంపుడు ప్రచారం చేస్తున్నారు. అక్కడక్కడా కొన్ని రోడ్లకు మరమ్మతులు చేసి మొత్తం జిల్లాలోని రోడ్లు అన్నీ తీర్చిదిద్దామని గొప్పలకు పోతున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలో రూ.32 కోట్లతో రోడ్లను ఆధునీకరించామన్నారు. అయితే ఏడాది కూడా కాకుండానే పూడ్చిన గోతులకు తోడు, కొత్త గోతులు వచ్చి చేరాయి. రెండు రోజులుగా జిల్లాలో కురిసిన వర్షాలకు రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఇంచుమించు ప్రతి నియోజకవర్గంలోనూ గోతుల్లో నీరు చేరి ప్రయాణం నరక ప్రాయంగా మారింది. ఇక పంచాయతీరాజ్ రోడ్లను నిధుల కొరత పట్టి పీడిస్తోంది. ఉపాధి పథకంలో వీధుల్లో వేసిన సీసీ రోడ్లకు సొమ్ములు లేవు. దీనితో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. జిల్లాలో మండలాల వారీగా రోడ్ల దుస్థితిపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు
వర్షాలకు చెరువుల్లా
మారిన రహదారులు
గోతుల్లోకి చేరిన నీరు
ప్రయాణం చేయాలంటే హడలే
మరమ్మతులు చేసిన చోటా గుంతలే
జిల్లాలో ప్రధాన రహదారుల దుస్థితి
సాక్షి గ్రౌండ్ రిపోర్టులో వెల్లడి
అమలాపురం
అమలాపురం నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రధాన ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్లు గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నివాసముండే హౌసింగ్ బోర్డుకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. నల్ల వంతెన – ఎర్ర వంతెనల మధ్య ఉన్న ఈ రోడ్డుపై గోతులు లెక్క పెడితే గిన్నిస్ బుక్‌లో పేరు నమోదు చేస్తారనే స్థాయిలో ఈ రోడ్డు ఉందని సామాజిక మాధ్యమాలలో సైటెర్లు వస్తున్నారు. కానీ ఈ రోడ్డు కనీస మరమ్మతులకు మాత్రం నోచుకోలేదు.
ఎమ్మెల్యే ఆనందరావు సొంత మండలం ఉప్పలగుప్తంలో రోడ్లు దుస్థితికి ఉప్పలగుప్తం నుంచి మునిపల్లి, చినగాడవిల్లి మీదుగా ఉప్పూడి వెళ్లే ప్రధాన రహదారి ఒక మచ్చుతునక. మునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పొడవునా వర్షం నీటితో చెరువును తలపిస్తోంది. చినగాడవిల్లి వద్ద స్థానికులు కొంత వరకు ఉన్న పీఆర్ రోడ్డుకు మరమ్మతులు చేసుకున్నారు. అక్కడ మినహా మిగిలిన చోట్ల నీటితో నిండిపోయింది.
వానొస్తే.. అవస్థే..
వానొస్తే.. అవస్థే..