
వనామీ సాగు
ఆక్వా రైతులకు వరుస కష్టాలు
ఇప్పటికే సుంకాల మోత
తాజాగా వైరస్ విజృంభణ
సాక్షి, అమలాపురం: ఆక్వా రైతులను వరస కష్టాలు వెంటాడుతున్నాయి. మొదటి పంటకు సుంకాల వాత, రెండో పంటపై వైరస్ దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వనామీకి అమెరికా, యూరప్ దేశాల నుంచి క్రిస్మస్ ఆర్డర్లు మొదలయ్యాయి. అమెరికా సుంకాల భారం పడుతున్నా డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్‌లో వనామీ రొయ్యల ధరలు కొంత వరకు పర్వాలేదు. అయితే వైరస్‌ల వల్ల తక్కువ సైజులో రొయ్యలు చనిపోతుండడంతో ఆక్వా రైతులు పెరిగిన మార్కెట్‌ను అందుకోలేకపోతున్నారు.
ధరల పతనం
ఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరిగిన ప్రతిసారి ఏదో ఒక ఉపద్రవం రావడం, ధరలు పతనం కావడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధమైన పరిస్థితి ఉంది. ధరలు స్వల్పంగా పెరిగాయి. కానీ వైరస్ కాటుతో వనామీకి భారీ నష్టాలు వస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 77 వేల ఎకరాలలో ఆక్వా సాగు జరుగుతోంది. దీనిలో కాకినాడ జిల్లాలో ఎనిమిది వేల ఎకరాలు, కోనసీమ జిల్లాలో 15 వేల ఎకరాలు చొప్పున సాగవుతున్నాయి.
సంక్షోభం
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆశాజనకంగా ఉన్న వనామీ సాగు ఆ తర్వాత తీవ్ర సంక్షోభంలో పడింది. మార్చిలో స్థానిక ఎగుమతిదారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించి వేశారు. దేశీయ ఎగుమతులపై అమెరికా 25 శాతం సుంకాల విధించడంతో వనామీ రొయ్యల ధరలు కౌంట్‌కు వచ్చి కేజీకి రూ.40 నుంచి రూ.60 ధరలు తగ్గించడంతో ఆక్వా పెను సంక్షోభంలో కూరుకుపోయింది. అమెరికాలోని వినియోగదారులపై పడాల్సిన భారాన్ని ఎగుమతిదారులు ఇక్కడ రైతులపై మోపారు. ఆ తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్‌కు రూ.15 మాత్రమే ధర పెంచడం విశేషం. రెండోసారి సుంకాల విధింపు ప్రకటన వచ్చిన తర్వాత మరోసారి ధరలు పతనమయ్యాయి.
కాపాడిన క్రిస్మస్
అమెరికాతో పాటు యూరప్ దేశాలలో ఈ నెలాఖరు నుంచి క్రిస్మస్ సందడి మొదలు కానుంది. ఇందుకు ఆయా దేశాల నుంచి ఆర్డర్లు రావడంతో ధరలు కొంత వరకు పెరిగాయి. ప్రస్తుత మార్కెట్‌లో 30 కౌంట్ (కేజీకి 30 రొయ్యల) ధర రూ.405 వరకు ఉంది. 40 కౌంట్ రూ.350, 45 కౌంట్ రూ.340, 50 కౌంట్ రూ.330, 60 కౌంట్ రూ.310, 70 కౌంట్ రూ.290, 80 కౌంట్ 265, 90 కౌంట్ రూ.245, 100 కౌంట్ రూ.235 చొప్పున ఉంది.
ధర పెరగక..
అమెరికా రెండోసారి సుంకాలను 50 శాతానికి పెంచడంతో 50 కౌంట్ నుంచి 30 కౌంట్ వరకు ధరలు భారీగా తగ్గుతాయని రైతులు, ఎగుమతిదారులు భయపడ్డారు. అయితే క్రిస్మస్ ఎగుమతులు కారణంగా ధరలు కొంత వరకు నిలబడ్డాయని ఎగుమతిదారులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు ఈ సీజన్‌లో ఎగుమతి అయ్యే రొయ్యల కన్నా ఇప్పుడు ఎగుమతి అయ్యే రొయ్యలు తక్కువగా ఉన్నా ఆ లోటును యూరప్ దేశాలు భర్తీ చేస్తున్నాయి. దీని వల్ల ధర నిలకడగా ఉంది. అయితే 100 కౌంట్ స్థానిక రైతులకు గిట్టుబాటు కావడం లేదు. పెరిగిన మేత, రొయ్య పిల్లలు, విద్యుత్ భారం వల్ల 100 కౌంట్ ఉత్పత్తికి రూ.240 వరకు అవుతోందని రైతులు చెబుతున్నారు. దేశీయంగా ఈ కౌంట్‌కు మంచి డిమాండ్ ఉన్నా ధర పెరగక పోవడం వెనుక ఎగుమతి దారుల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండో పంటకు వైరస్
ఒక వైపు ధరలతో సతమతమవుతున్న రైతులను వనామీ రొయ్యలకు వస్తున్న వైరస్‌లు ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రధానంగా వైట్ స్పాట్, వైట్ గట్, ఈహెచ్‌పీలు అధికంగా సోకుతున్నాయి. వీటి దాడులతో వనామీ విలవిలాడుతోంది. చాలా చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో రొయ్య పిల్లలు వదిలిన 30 నుంచి 60 రోజుల వ్యవధిలో ఈ వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఆ సమయానికి రొయ్య పిల్ల బరువు మూడు గ్రాముల నుంచి పది గ్రాముల లోపు ఉంటోంది. రొయ్యల కౌంట్ 100 నుంచి 140 కౌంట్ మధ్యలో వైరస్ సోకి చనిపోతున్నాయని, దీని వల్ల అధికంగా నష్టపోతున్నామని అమలాపురం మండలం సమనసకు చెందిన దొరబాబు ‘సాక్షి’ వద్ద వాపోయారు.
రొయ్యల పెరుగుదలలో వ్యత్సాసం
ఈహెచ్‌పీ అధిక నష్టాలను మిగులుస్తోంది. ఈ వైరస్ వల్ల రొయ్యల పెరుగుదలలో వ్యత్యాసం అధికంగా ఉంటోంది. ఒకే చెరువులో రొయ్యల పట్టుబడులు చేస్తుంటే కొన్ని 100, మరికొన్ని 120, 150 కౌంట్ వస్తున్నాయి. దీని వల్ల నష్టం తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో రైతులు జూలై నుంచి రెండో పంట మొదలు పెట్టారు. ఈ సమయంలో పంట మొదలు పెట్టిన 40 శాతం చెరువులు వైరస్ బారిన పడ్డాయని అంచనా. ఇదే వనామీ రైతులను కుంగదీస్తోంది. కొన్ని హేచరీల నుంచి వైరస్ సోకిన రొయ్య పిల్లలు వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు..

చిన్న వయసులో పట్టుబడి పట్టిన వనామీ రొయ్యలు