ఆహారం.. ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

ఆహారం.. ఆరోగ్యం

Sep 7 2025 7:56 AM | Updated on Sep 7 2025 10:56 AM

ఆహారం

ఆహారం.. ఆరోగ్యం

పోషకాహారంతో ఎన్నో ప్రయోజనాలు

ఈ నెల 12 నుంచి రాష్ట్రీయ పోషణ్‌

అక్టోబర్‌ 11 వరకూ కార్యక్రమాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

రాయవరం: ఆరోగ్యకర జీవనంలో పోషకా హారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిలో ఎలాంటి లోపాలున్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిన్నారుల్లో పోషకాహార లోపాలు వారి భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారతాయి. పోషకాహార లోపాల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి సీ్త్ర, శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 11 వరకూ 8వ రాష్ట్రీయ పోషణ్‌ మాహ్‌ 2025 నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5,546 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో పోషణ్‌ అభియాన్‌–మిషన్‌ పోషణ్‌ 2.0 పేరుతో నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఊబకాయం, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌, ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌, ఇన్‌ఫాంట్‌ అండ్‌ యంగ్‌ చైల్డ్‌ ఫీడింగ్‌ ప్రాక్టీసెస్‌, మెన్‌ స్ట్రీమింగ్‌ – ఇన్వాల్వింగ్‌ మెన్‌ ఇన్‌ న్యూట్రిషన్‌ అండ్‌ కేర్‌ గివింగ్‌ తదితర

అంశాలను వివరిస్తారు.

కోనసీమ జిల్లా పరిధిలో..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలో మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,726 అంగన్‌వాడీ కేంద్రాల్లో 7,725 మంది గర్భిణులు, 5,848 మంది బాలింతలు, 901 మంది ఆరు నెలల లోపు చిన్నారులు, 7,017 మంది ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు, 8,041 మంది 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు ఉన్నారు.

విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

కోనసీమ జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా 1,81,759 మంది విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో 70,254 మందికి రక్తహీనత పరీక్షలు నిర్వహించగా, 16,680 మంది ఎనిమిక్‌గా ఉన్నట్లు గుర్తించారు. అలాగే కంటి వైద్య పరీక్షల అనంతరం 3,300 మంది విద్యార్థులకు కళ్లద్దాలు అందజేశారు. 1,204 మంది చర్మవ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించగా, 100 మందికి హియరింగ్‌ ఎయిడ్స్‌ అందజేశారు. 10 మందికి గ్రహణం మొర్రి ఉన్నట్లుగా గుర్తించగా, వీరిలో 9 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో జూలైకు సంబంధించి 7,303 మంది గర్భిణులు ఉండగా, వారిలో 542 మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించారు. మొత్తం గర్భిణుల్లో 7.42 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. వారికి టీహెచ్‌ఆర్‌ పంపిణీ చేస్తున్నారు.

పోషకాహారంపై అవగాహన

అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచాలని ప్రతి ఏటా సెప్టెంబర్‌లో జాతీయ పోషకాహార వారోత్సవాలను అమలు చేస్తున్నారు. గతంలో వారం రోజుల పాటు నిర్వహించగా, వీటిని ఇప్పుడు నెల రోజులకు పొడిగించారు. కోవిడ్‌ 19 తదనంతర పరిస్థితుల్లో పోషకాహారం మరింతగా తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పోషకాహార వినియోగంపై సూచనలు అందిస్తోంది. విటమిన్‌ ఏ లేకపోవడం వల్ల మన దేశంలో ఏటా 30 వేల మంది కంటి చూపును కోల్పోతున్నారని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఊబకాయం వల్ల టైప్‌ – 2 డయాబెటీస్‌, ఫ్యాటీ లివర్‌ వ్యాధి, పిత్తాశయంలో రాళ్లు, కీళ్ల రుగ్మతలు, రక్త పోటు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. వీటి నివారణకు సరైన పోషకాహార వినియోగంపై అధికారులు అవగాహన కల్పించనున్నారు.

ప్రణాళికాబద్ధంగా నిర్వహణ

చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాల నివారణకు పోషణ మాసోత్సవాలను జిల్లా వ్యాప్తంగా ప్రణాళికా బద్ధంగా నిర్వహిస్తాం. ముఖ్యంగా ఐదు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో లయన్‌ డిపార్ట్‌మెంట్లతో కలిసి కార్యక్రమాలు చేపడతాం. ముందుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రజల్లోకి తీసుకువెళతాం.

– వై.విజయశ్రీ, ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఆహారం.. ఆరోగ్యం 1
1/3

ఆహారం.. ఆరోగ్యం

ఆహారం.. ఆరోగ్యం 2
2/3

ఆహారం.. ఆరోగ్యం

ఆహారం.. ఆరోగ్యం 3
3/3

ఆహారం.. ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement