
పాఠశాల 150 ఏళ్ల వేడుకకు హాజరు కావాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని ఆహ్వానించిన ఎమ్మెల్సీ కుడుపూడి
అమలాపురం టౌన్: అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వచ్చే నవంబర్‌లో నిర్వహించనున్న వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడిని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు స్వయంగా ఆహ్వానించారు. విజయవాడ సమీపంలోని స్వర్ణ భారతి ట్రస్ట్ భవనంలో ఉన్న ఆయన్ని ఎమ్మెల్సీ కలసి ఆహ్వాన పత్రాన్ని శనివారం అందించారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఇద్దరూ కలసి చదువుకున్నారు. యూనివర్సిటీ లా కాలేజీలో వారు విద్యార్థులుగా ఉన్న సమయంలో జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వెంకయ్య నాయుడు, ప్రధాన కార్యదర్శిగా సూర్యనారాయణరావు ఎన్నికయ్యారు.
అప్పట్లో వీరిద్దరూ విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగిన పోరాటంలో పాలు పంచుకున్నారు. ఈ చనువు, స్నేహంతో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడిని అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150 ఏళ్ల వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించానని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు తెలిపారు. తన ఆహ్వానం మేరకు విధిగా హాజరవుతానని అన్నారన్నారు. అలాగే ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆహ్వానించనున్నట్లు తెలిపారు. వెంకన్నాయుడు, హరిబాబు, తాను ఆంధ్ర యూనివర్సిటీలో చదివామన్నారు.