సాక్షి, పార్వతీపురం మన్యం/పాచిపెంట: విజయనగరం, పార్వతీపురం మన్యం మీదుగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా లారీలో తరలిస్తున్న 220 టన్నుల రేషన్ బియ్యాన్ని పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు సమీపంలో శనివారం విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లంపూడి నుంచి ఒడిశాలోని నౌగాంకు ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు తెలిసింది. చెక్‌పోస్టు వద్ద విజిలెన్స్ సీఐ సింహాచలం, సిబ్బందితో కలిసి లారీని పట్టుకున్నారు. విచారణ అనంతరం స్థానిక సీఎస్‌డీటీ హేమలతకు అప్పగించారు. బియ్యాన్ని మంచాడవలస జీసీసీ గోదాంలో భద్రపరిచారు. పట్టుకున్న సరకు విలువ సుమారు రూ.11.53 లక్షలు ఉంటుందని అంచనా. తనిఖీల్లో విజిలెన్స్ ఎస్సై రామారావు, హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు, కానిస్టేబుల్ తిరుపతిరావు ఉన్నారు.
లారీపై జనసేన గుర్తులు
బియ్యాన్ని తరలిస్తున్న లారీపై పెద్ద అక్షరాలతో జనసేన పేరుతో పాటు, ఆ పార్టీ గుర్తులు ఉన్నాయి. జనసేనకు చెందిన నాయకుడి వాహనంగా తెలుస్తోంది. ఆ బియ్యం తరలింపులో పార్టీ వారి పాత్ర ఉందా? లేకుంటే కేవలం లారీనే ఇచ్చారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.