
పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ పరిశీలించగా మిగిలిన విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు.
ఈ పరిశీలనంతా అభ్యర్థులు ఆన్‌లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారి సర్టిఫికెట్లు శుక్రవారం పరిశీలించనున్నారు.