
ఎలుకలుకలు
కొత్తపేట: వరిలో ఎలుకల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా వరి పంటను మూషికాలు నాశనం చేస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆకుమడి దశ నుంచి కుప్పల వరకు రైతులకు ఈ సమస్య తప్పడం లేదు. దీంతో అధికంగా నష్టపోతున్నారు. పంట చేతికందే వరకు ఎలుకల బెడద ఉంటోంది. వీటిని సమర్థంగా అరికట్టేందుకు రైతులంతా సామూహిక నిర్మూలన చర్యలు చేపట్టడం వల్లే సాధ్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరితో పాటు, ఉద్యాన పంటలైన కొబ్బరి, అరటి, కూరగాయల తోటలకు ఎలుకల బెడద ఎదురవుతోంది. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసి, పిలకలు వేసే దశలో ఉంది. ఈ దశలో ఎలుకల వల్ల కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఎలుకలు నీటి మట్టానికి 6 సెంటీమీటర్ల ఎత్తులో వరి పిలకలను కొరికేస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ.
ఇలా గుర్తించవచ్చు
ఎలుకలు సంచరించే పొలం గట్లపై బొరియలు ఉంటాయి. పొలంలో కొరికి వేసిన వరి పిలకలు, దుబ్బులు పడి ఉంటాయి. పొలంలోని బురదలో ఎలుకల పాదముద్రలు కనిపిస్తాయి. ఎలుకల విసర్జనాల ద్వారా వాటి ఉనికిని సులభంగా గుర్తించవచ్చు.
నివారణ చర్యలు
ముందుగా రైతులు తమ పొలం గట్లపై కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. రైతు భరోసా కేంద్రాల్లో బ్రొమోడయోలిన్ అనే ఎరను రైతులకు ఉచితంగా లభిస్తుంది. 480 గ్రాముల నూకలు, 10 గ్రాముల బ్రొమోడయోలిన్ మందు, 10 గ్రాముల నూనెతో 500 గ్రాముల ఎరను తయారు చేసుకోవచ్చు. ఈ ఎర 50 బొరియలకు సరిపోతుంది. తొలి రోజు బొరియలను మట్టితో కప్పేయాలి. రెండో రోజు ఆ బొరియలు తెరుచుకుని కనిపిస్తాయి. ఈ బొరియల వద్ద 10 గ్రాముల బ్రొమోడయోలిన్ ఎర పొట్లాలను ఉంచాలి. ఆ ఎరను తిన్న ఎలుకలు చనిపోతాయి. రెండో విధానంలో వేటగాళ్లతో ఎలుక బుట్టలు వేయించి, వాటిని అరికట్టవచ్చు. ఈ విధానంలో వేటగాళ్లు ఎలుకకు రూ.60 వరకు తీసుకుంటారు. మరో విధానంలో బొరియలో పొగ పెట్టి ఎలుకలను చంపుతారు. ఇలా చేస్తే ఒక్కో ఎలుకకు రూ.100 తీసుకుంటారు. రెండు విధానాలు అధిక ఖర్చుతో కూడినది కావడంతో, రైతులు బ్రొమోడయోలిన్ ఎర ద్వారానే నివారణ సులభమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
రెండు సబ్ డివిజన్లలో..
ప్రస్తుత సీజన్‌లో కోనసీమ జిల్లాలో 1.94 లక్షల ఎకరాలు వరి, బంజరు భూములు ఉండగా, 79,475 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలను ఎలుకల బారి నుంచి రక్షించేందుకు వ్యవసాయ శాఖ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని తలపెట్టింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లకు 776 కిలోల బ్రొమోడయోలిన్ మందు చేరినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 22 మండలాల్లో 415 గ్రామాలకు పంటల విస్తీర్ణాన్ని బట్టి మందును సరఫరా చేశారు. ముందుగా ఆలమూరు సబ్ డివిజన్‌లోని ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం సబ్ డివిజన్‌లోని రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో బుధవారం సామూహిక నిర్మూలన కార్యక్రమం చేపట్టనున్నారు. మిగిలిన సబ్ డివిజన్లలో ఈ నెల 4న లేదా 9న కార్యక్రమం నిర్వహించనున్నారు.
సామూహికంగానే చేపట్టాలి
సార్వా పంటకు ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎవరికి వారు ఎలుకలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. సామూహికంగా బ్రొమోడయోలిన్ మందును బొరియల్లో పెట్టడం ద్వారా మాత్రమే సమర్థంగా అరికట్టవచ్చు. దీనిపై రైతులకు ఏటా అవగాహన కల్పించి, మందును ఉచితంగా అందిస్తున్నాం. ప్రస్తుత తొలకరి సీజన్‌లో ఎలుకలను అరికట్టడానికి అవసరమైన బ్రొమోడయోలిన్ మందు త్వరలోనే రైతు భరోసా కేంద్రాలకు వస్తుంది. గ్రామాల వారీగా, వరి ఆయకట్టుల వారీగా రైతులతో మందు ఎరను చేనుల్లో పెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట
ఏటా సార్వాలో రైతులకు తప్పని బెడద
వరి పిలకలను కొరికేస్తుండడంతో
తీవ్ర నష్టం
నేడు ఆలమూరు, రామచంద్రపురం
సబ్ డివిజన్లలో సామూహిక నివారణ

ఎలుకలుకలు

ఎలుకలుకలు

ఎలుకలుకలు