
పొట్టకూటికి వచ్చి.. చోరీల బాట
● పశ్చిమ బెంగాల్ వాసి అరెస్టు
● 37 గ్రాముల బంగారం స్వాధీనం
మలికిపురం: వేరే రాష్ట్రం నుంచి పొట్టకూటికి వచ్చిన వ్యక్తి.. చెడు అలవాట్లకు బానిసై చోరీల బాట పట్టిన ఉదంతమిది. చోరీ కేసుల్లో నిందితుడైన అతడిని అరెస్టు చేసి, రూ.3.50 లక్షల విలువైన 37 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు రాజోలు సీఐ టీవీ నరేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. రెండు రోజుల క్రితం తూర్పుపాలెంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తు చేపట్టిన ఎస్సై పీవీఎస్‌ఎస్ సురేష్‌కుమార్ తన సిబ్బందితో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం మలికిపురం మండలం తూర్పుపాలెం బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లా దుతుర్ధా పరిధిలోని బైద్యాధి ప్రాంతానికి చెందిన రాఫ్కుల్ తరఫ్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారణ చేసి, ఇటీవల తూర్పుపాలెంలో జరిగిన చోరీ కేసు నిందితుడిగా గుర్తించారు. అతడు ఇచ్చిన సమాచారంతో 37 గ్రాముల బంగారాన్ని పోలీసులు రికవరీ చేశారు. జీవనోపాధి కోసం నిందితుడు పశ్చిమ బెంగాల్ నుంచి మలికిపురం మండలంలోని తూర్పుపాలెం గ్రామం వచ్చి ఉంటున్నాడు. కొన్నాళ్లు తూర్పుపాలెంలో చికెన్ షాపుల్లో, ఇటుక బట్టీల్లో పని చేశాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. కష్టపడి పని చేసే సంపాదన చాలకపోవడంతో, చోరీల బాట పడ్డాడు. సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఇంకా ఇతడిపై ఏయే పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదయ్యాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా కేసును త్వరితంగా ఛేదించిన ఎస్సై సురేష్‌కుమార్, సిబ్బంది ఏఈ విక్టర్‌బాబు, బాబ్జి, దుర్గాప్రసాద్, సుజన్, చిన్నను సీఐ అభినందించారు.