
నీట మునిగి వదినామరదళ్ల మృతి
● ఏలేరు కాలువలో దుర్ఘటన
● మృతులు మందుల కాలనీకి చెందినవారు
● ఇసుక అక్రమ తవ్వకాలే కారణమంటున్న
స్థానికులు
ఏలేశ్వరం: నీటి లోతు అవగాహన లేకపోవడంతో ఏలేరు కాలువలో దిగిన ఇద్దరు వదినామరదళ్లు మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు, మందుల కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మి(38), పెండ్ర కుమారి(13) వరుసకు వదినామరదళ్లు. వీరు గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి తల వెంట్రుకలకు అల్యూమినియం పాత్రలు ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. ఇలాఉండగా, వీరిద్దరూ కలిసి వంట కోసం పుల్లలు ఏరుకునేందుకు ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. దాహం వేయడంతో కాలువలోకి దిగి.. గోతులు ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి సంఘటన ప్రదేశంలో మునిగిపోయిన ఇద్దరినీ వెలికితీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు లక్ష్మీకి భర్త అప్పన్న, కుమారైలు భవాని, జ్యోతి, కుమారులు హరి, అశోక్ ఉన్నారు. మృతురాలు కుమారికి తల్లిదండ్రులు సత్తిబాబు, అంకమ్మ, సోదరుడు రాజు, సోదరి శ్యామల ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మందుల కాలనీలో విషాద ఛాయలు
ఎప్పుడు కలిసి తిరిగే లక్ష్మి, కుమారి ఏలేరు కాలువలో మునిగి మరణించడంతో మందుల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చలాకీగా కళ్ల ముందే తిరిగే వారిద్దరూ శాశ్వతంగా దూరం కావడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిందంటూ లక్ష్మి కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కలిచివేసింది.
అక్రమ తవ్వకాలు
పాలకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేసిన ఇసుక అక్రమ తవ్వకాలు రెండు నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఏలేరు కాలువలో ఎటువంటి అనుమతులు లేకుండా, పొక్లెయిన్లతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. కొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుండగా.. మరికొందరు వాటికి బలవుతున్నారు. స్థానిక కప్పలచెరువు సమీపంలోని శశ్మానం మీదుగా ఏలేరు కాలువలో రాత్రుళ్లు ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి ఏలేరు కాలువలో ఇసుకతో పాటు, మట్టినీ అక్రమంగా తవ్వేస్తున్నారని చెబుతున్నారు.
యువకుడిని రక్షించిన పోలీసులు
అమలాపురం టౌన్: వినాయక విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తున్నప్పుడు అదుపుతప్పి నదిలో పడి కొట్టుకుపోతున్న యువకుడిని పట్టణ పోలీసులు కాపాడారు. బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై ఉన్న వంతెన వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామం పల్లపువీధి నుంచి గణేశ్ విగ్రహాన్ని వైనతేయ నదిలో నిమజ్జనం చేసేందుకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జనం సమయంలో అదే గ్రామానికి చెందిన చిలకలూరి చినసాయికృష్ణ (27) అదుపుతప్పి నదిలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని స్థానికులు తాడు సాయంతో కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ బందోబస్తులో ఉన్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వీవీ శ్రీనివాసరావు స్పందించి.. మత్స్యకారుల సహకారంతో యువకుడిని పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చారు.
గోదావరి నదిలో వృద్ధుడి గల్లంతు
మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామానికి చెందిన ఒలుపు కార్మికుడు రవణం సాయిబాబు (78) మంగళవారం వైనతేయ గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఒలుపు ఒలిచేందుకు వెళ్లిన సాయిబాబు.. బహిర్భూమికి వెళ్లి, అదుపుతప్పి గోదావరి నదిలో పడి కొట్టుకుపోయాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. గల్లంతైన సాయిబాబు ఆచూకీ కోసం రెండు బోట్ల సహాయంతో గోదావరి నదిలో రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై సాయిబాబు కుమారుడు పల్లంరాజు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నీట మునిగి వదినామరదళ్ల మృతి

నీట మునిగి వదినామరదళ్ల మృతి

నీట మునిగి వదినామరదళ్ల మృతి

నీట మునిగి వదినామరదళ్ల మృతి

నీట మునిగి వదినామరదళ్ల మృతి