
ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ
ఆరుగురికి గాయాలు
ఏలేశ్వరం: జాతీయ రహదారిపై యర్రవరం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు, ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న బస్సు జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న డ్రైవర్‌తో పాటు, ఐదుగురికి గాయాలయ్యారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళన
కాకినాడ రూరల్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ బ్రెయిన్ డెడ్ అయిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. మృతురాలి బంధువుల వివరాల ప్రకారం, రమణయ్యపేట గైగోలుపాడుకు చెందిన మహిళ మేడిశెట్టి దుర్గాభవాని(38)కి భర్త వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 30న సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ డెంటల్ ఆస్పత్రిలో దంత వైద్యానికి వెళ్లింది. దంతాలు తొలగించే క్రమంలో అధిక రక్తస్రావం కావడంతో, అదే రోజు మెరుగైన చికిత్సకు ఆమెను మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు చెప్పడంతో, ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. బోన్ మేరో క్యాన్సర్‌తో మెదడులో రక్తస్రావం కారణంగా బ్రెయిన్ డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్‌కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.