అయినవిల్లి విఘ్నేశ్వరుని సన్నిధిలో అభిషేక పూజలు చేస్తున్న భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరుని క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ జరిగింది. అనంతరం స్వామికి విశేష పూజలు చేశారు. లఘున్యాస అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమంలో అధిక సంఖ్యలో భక్త దంపతులు పాల్గొన్నారు. పంచామృత, ప్రత్యేక అభిషేకాల్లో 158 మంది, స్వామివారి ప్రత్యేక దర్శనంలో1,269 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 37 మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. అలాగే నూతన వాహన పూజలు, చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాలు జరిగాయి. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాల ద్వారా రూ.3,17,793 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, చైర్మన్ గుత్తుల నాగబాబు తెలిపారు.
నేడు యథావిధిగా ‘స్పందన’
అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘స్పందన’ (జగనన్నకు చెబుదాం) కార్యక్రమం సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి, ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి, తహసీల్దార్ కార్యాలయాల్లో గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని వివరించారు. అధికారులంతా ఉదయం 10 గంటల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని, గ్రామ స్థాయిలో వార్డు సచివాలయాల్లో మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య విజ్ఞాపనలు స్వీకరిస్తారని కలెక్టర్ తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


