Delhi Court: ఆ స్తోమత లేదా? అయినా భరించాల్సిందే! పాపం ఆ భర్తకు షాక్​

Unemployed Husband Not Escape From Wife Maintenance Says Delhi Court - Sakshi

భర్త పెట్టే వేధింపులు భరించలేక.. దూరంగా, వేరుగా ఉంటోందామె. అయితే భర్త తనకు దూరంగా మంచి జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, కాబట్టి, తనకు మెయింటెనెన్స్​ కోసం కొంత డబ్బు ఇప్పించాలని ఆ భార్య కోర్టును ఆశ్రయించింది. ఆపై పరిణామాలు ఆ భార్యకు అనుకూలంగా రాగా.. పైకోర్టును ఆశ్రయించిన భర్తకు పెద్ద షాకే తగిలింది. 

చాలా ఏళ్ల క్రితమే భర్తను వీడి.. దూరంగా ఉంటున్న ఆ భార్యకు మధ్యంతర భరణంగా నెలకు రూ.5,133 చెల్లించాలని భర్తను ఆదేశించింది మహిళా కోర్టు. అయితే ఈ తీర్పుపై ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా.. చేదు అనుభవమే ఎదురైంది. తాను నిరుద్యోగినని, భరణంగా డబ్బులు ఇవ్వలేనని పిటిషన్‌లో వేడుకున్నాడు ఆ భర్త. దీనిపై ఈమధ్యే విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు, భర్త నిరుద్యోగి అయినంత మాత్రాన తన భార్యను పోషించే బాధ్యత నుంచి తప్పించుకోలేడని స్పష్టం చేసింది.
 
నిరుద్యోగం కారణంగా చూపి భార్యకు మధ్యంతర భరణం ఇచ్చే బాధ్యత నుంచి భర్త తప్పించుకోలేడని తీస్ హజారీ కోర్టుల అదనపు సెషన్స్ జడ్జి సంజయ్ శర్మ తీర్పునిచ్చారు. ‘‘భర్త నిరుద్యోగి. అది వాస్తవమే కావొచ్చు. అయినప్పటికీ భార్యకు భరణం చెల్లించే బాధ్యత నుంచి అది తప్పించలేదు. ఈ కేసులో భర్తకు మంచి విద్యార్హత ఉంది.  వృత్తిపరంగా అనుభవమూ ఉంది. ఇప్పుడు ఉద్యోగం లేనంత మాత్రానా.. తర్వాతి రోజుల్లో మరో ఉద్యోగం సంపాదించలేడా?. వైకల్యం ఏం లేదు కదా’’ అని జడ్జి భర్తను ఎదురు ప్రశ్నించారు. 

వరకట్న వేధింపులకు పాల్పడి మరీ తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆ భర్తపై భార్య ఆరోపణలు చేసింది. అతడి వేధింపులు తాళలేక వేరుగా నివసిస్తూ.. నెలకు రూ.50 వేల జీతంతో విలాసవంతంగా బతుకుతున్నాడని, తన మెయింటెనెన్స్​ కోసం కొంత ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. అయితే.. తాను ఇంటి ఖర్చులు భరిస్తున్నానని, అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూసుకుంటున్నానని, కుట్టుపని ద్వారా తన కంటే తన భార్యే ఎక్కువ సంపాదిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ఆమెకు మంచి సౌకర్యాలు అందించాలని, అది నైతిక, చట్టపరమైన బాధ్యత అని ఢిల్లీ కోర్టు వ్యాఖ్యానించింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top