వరుసకు బాబాయ్‌.. మద్యం మత్తులో బాలికపై అత్యాచారం, హత్య!

Uncle who molested and killed Girl in Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్‌/రాజాపూర్‌: వావి వరుసలు మరిచాడు.. వరుసకు అన్న కూతురు అనీ చూడలేదు.. బాలిక అనే కనికరమూ చూపించలేదు.. మద్యం మత్తులో స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని అంతా కలిసి కిరాతకంగా గొంతు నులిమి బాలికను చంపేశారు. పైగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చిత్రీకరించేందుకు ఫ్యాన్‌కు ఉరేసుకున్నట్టుగా వేలాడదీశారు. తీవ్ర కలకలం రేపిన ఈ దారుణ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలంలోని ఓ తండాలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. గ్రామస్తులు, బాధిత కుటుంబం చెప్పిన వివరాల మేరకు ముగ్గురు వ్యక్తులు దారుణానికి పాల్పడినా.. ఘటన జరిగిన తీరుపై భిన్నమైన వివరాలు ప్రచారంలో ఉన్నాయి. 

తల్లిదండ్రులు ఊరెళ్లడంతో.. 
సదరు తండాకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమార్తె ఇంటర్, చిన్న కుమార్తె (15) పదో తరగతి చదువుతున్నారు. శుక్రవారం బంధువుల ఇంట్లో పోశమ్మ పండుగ ఉండటంతో తల్లిదండ్రులు కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వెళ్లారు. పెద్ద కుమార్తె హాస్టల్‌లో ఉండగా చిన్నకుమార్తె ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే ఆమెపై కన్నేసిన నేనావత్‌ శ్రీనుకు ఈ విషయం తెలిసింది. బాలికకు వరుసకు బాబాయి అయిన శ్రీను.. తన స్నేహితుడు అడ్వొకేట్‌ అయిన శ్రీనివాస్, పక్క గ్రామానికి చెందిన టీవీ మెకానిక్, కేబుల్‌ ఆపరేటర్‌ శివతో కలిసి అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి దారుణానికి పాల్పడ్డారు. 

బెల్టుషాపు కావడం.. పరిచయం ఉండటంతో.. 
బాలిక తల్లిదండ్రులు స్థానికంగా కిరాణా దుకాణంతోపాటు బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. పక్కనే శ్రీను (నిందితుడు) నివాసం ఉంటున్నాడు. బాలిక ఇంట్లో ఎవరూ లేరని తెలియడంతో.. మద్యం తాగుదామని తన స్నేహితులు అడ్వొకేట్‌ శ్రీనివాస్, శివను రప్పించుకున్నాడు. అంతా కలిసి అర్ధరాత్రి ఆమె ఇంట్లోకి వెళ్లారు. శ్రీను వరుసకు బాబాయి కావడం, కేబుల్‌ ఆపరేటర్‌గా శివ పరిచయం ఉండటంతో బాలిక అభ్యంతరం చెప్పలేదని కుటుంబ సభ్యులు, స్థానికులు చెప్తున్నారు.

నిందితులు మద్యం తాగాక మత్తులో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని.. విషయం బయటపడుతుందని గొంతు నులిమి చంపి, ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారని అంటున్నారు. అయితే నిందితుల్లో ఒకరైన శివ ముందే ఆ బాలిక ఇంట్లో ఉన్నాడని.. శ్రీను, శ్రీనివాస్‌ వెళ్లి అతడిని కొట్టి పంపించేసి, బాలికపై దాషీ్టకానికి పాల్పడ్డారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ ఆడియో ప్రచారమవుతోంది. మరోవైపు మృతురాలు రాసినట్టుగా పేర్కొంటూ ఓ సూసైట్‌ నోట్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు 
బాలికపై దారుణానికి సంబంధించి నేనావత్‌ శ్రీను, అడ్వొకేట్‌ శ్రీనివాస్, టీవీ మెకానిక్‌ శివలపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటనకు సంబంధించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని, పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇక ఈ ఘటన నిందితులు ముగ్గురూ పరారీలోనే ఉన్నారు. 

నిందితుల ఆస్తులు ధ్వంసం 
బాలికపై అత్యాచారం, హత్యకు పాల్పడిన విషయం తెలియడంతో తండా వాసులు ఆందోళనకు దిగారు. నిందితుడు శ్రీను ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. మరో నిందితుడు శ్రీనివాస్‌కు చెందిన ఇంటి పైకప్పు రేకులను ధ్వంసం చేశారు. పక్క గ్రామానికి ట్రాక్టర్లలో వెళ్లి నిందితుడు «శివకు చెందిన కారును తగలబెట్టారు. అతడి టీవీ మెకానిక్‌ దుకాణాన్ని ధ్వంసం చేశారు. అనంతరం బాలిక మృతదేహంతో కుటుంబ సభ్యులు, తండావాసులు బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు. కాగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో బాలిక మృతదేహాన్ని పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దారుణానికి పాల్పడినవారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. 

గతంలోనూ చెడు ప్రవర్తన! 
నిందితుడు నేనావత్‌ శ్రీను గతంలోనూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఇక మరో నిందితుడు శివపై ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నట్టు సమాచారం. 

వారిని చూశా.. ఇంత పని చేస్తారనుకోలేదు 
‘‘అర్ధరాత్రి 12 అవుతోందనుకుంటా.. వీధి దీపాలు కూడా లేవు. బయట చప్పుడైతే వెళ్లి చూశాను. బెల్టుషాపు వద్ద శ్రీను, శివ ఉన్నారు. ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారని అడిగా. మద్యం కోసం వచ్చామన్నారు. శ్రీనుకు కూడా బెల్టుషాపు ఉంది కదా అని అడిగాను. మద్యం అయిపోయిందని, అందుకే ఇక్కడికి వచ్చామని అన్నాడు. తెలిసినవాళ్లే కదా అని వెళ్లిపోయా. ఇంత దారుణానికి పాల్పడతారని అనుకోలేదు. 
– రాందాస్, సమీపంలోని ఇంట్లో నివసిస్తున్న వ్యక్తి 

చదవండి: (హోమ్‌ ట్యూషన్‌ చెప్పేందుకు వెళ్లి.. అఖిల్‌ వచ్చాడని సారిక వాట్సాప్‌ మెసేజ్‌ చేసి..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top