ప్రతీకార హత్యలు: ఉదయం తమ్ముడిని.. అర్ధరాత్రి అన్నను

Two Brothers Assassination Over Land Row In Nalgonda - Sakshi

నల్లగొండ జిల్లా నీలగిరిలో ప్రతీకార హత్యలు 

భూమి సరిహద్దులపై కొన్నాళ్లుగా వివాదం 

తమ్ముడిని చంపిన అన్న కుమారులు 

అదేరోజు రాత్రి అన్నను చంపేసిన తమ్ముడి బంధువులు

సాక్షి, నల్లగొండ క్రైం: ఇద్దరూ అన్నదమ్ములు.. కొన్నేళ్లుగా పొలం సరిహద్దుల విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతోంది.. ఇదే క్రమంలో ఉదయం అన్న కుమారులు ఇద్దరు కలిసి తమ్ముడి (బాబాయి)ని దారుణంగా చంపేయగా.. తమ్ముడి సమీప బంధువులు అదేరోజు రాత్రి అన్నను మట్టుబెట్టి ప్రతీకార హత్యకు పాల్పడ్డారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి శివార్లలో ఉన్న అక్కలాయిగూడెంలో ఆదివారం జరిగిన ఈ హత్యలు కలకలం రేపాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రం శివారు అక్కలాయిగూడేనికి చెందిన ఆవుల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు సోములు, కాశయ్య (63), రామస్వామి (57), సైదులు కుమారులు.

తల్లిదండ్రులు గతంలోనే నలుగురు కుమారులకు 4.5 ఎకరాల చొప్పున పంచారు. వారు వేర్వేరుగా సాగు చేసుకుంటున్నారు. ఇందులో కాశయ్య, రామస్వామి కుటుంబాల మధ్య ఏడేళ్లుగా గెట్టు పంచాయితీ నడుస్తోంది. పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నా పరిష్కారం కాలేదు. ఈ క్రమంలో రామస్వామి బోరు మోటార్‌ వేసేందుకు ఆదివారం ఉదయం పొలం దగ్గరికి వెళ్లాడు. అప్పటికే బావి వద్ద ఉన్న కాశయ్య కుమారులు మల్లేశ్, మహేశ్‌లు రామస్వామితో గొడవకు దిగారు. తీవ్రంగా ఆవేశానికి లోనై గెట్టు మధ్యలో ఉన్న హద్దురాయిని తీసి తలపై మోదడంతో రామస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. 

మాటేసి ప్రతీకారం.. 
రామస్వామి హత్యపై ఆగ్రహించిన సమీప బంధువులు.. ప్రతీకారంగా కాశయ్యను చంపాలని నిర్ణయించుకుని, నిఘా వేశారు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఒంటరిగా గ్రామంలోకి వస్తున్న కాశయ్యను గమనించారు. శివార్లలోనే అడ్డుకుని, కర్రలతో తలపై బలంగా మోదారు. దాంతో కాశయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. స్థానికులు సోమవారం ఉదయం కాశయ్య మృతదేహాన్ని గుర్తించారు. హత్య, ప్రతీకార హత్యలతో అక్కలాయిగూడెం వణికిపోయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. రామస్వామి కుమారుడు కిరణ్‌ అదుపులోకి తీసుకొని విచారించారు. కుటుంబాల మధ్య భూ వివాదం కొనసాగుతున్నా.. ఉద్యోగరీత్యా తాము దూరం గా ఉన్నామని కిరణ్‌ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే అతడు చెప్పిన వివరాల మేరకు కొంద రు సమీప బంధువులే ప్రతీకార హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. పోలీసు పహారా మధ్య సోమవారం ఉదయం రామస్వామికి, సాయంత్రం కాశయ్య అంత్యక్రియలు నిర్వహించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top