స్కెచ్‌ వేసి.. కొల్లగొట్టారు..

Theif Robbed 4 Crores Worth Gold Andhra Pradesh - Sakshi

విజయనగరం క్రైమ్‌: జిల్లాలో ప్రతి మంగళవారం వాణిజ్య కార్యకలాపాలకు సెలవు. దుకాణాలు తెరచుకోవు. అదే రోజును దుండగలు చోరీకి ఎంచుకున్నారు. పక్కాగా స్కెచ్‌ వేశారు. కట్టర్లతో గ్రిల్స్, తాళాలు కోసి జ్యూయలరీ షాప్‌లో ఉన్న రూ.4 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని కొల్లగొట్టారు. జిల్లా కేంద్రంలోని గంటస్తంభం వద్ద ఉన్న రవి జ్యూయలరీ షాప్‌లో జరిగిన చోరీకి సంబంధించి వన్‌టౌన్‌ సీఐ జి.మురళి తెలిపిన వివరాలిలా..

గంటస్తంభం వద్ద ఉన్న పాండు జ్యూయలర్స్‌లోకి మంగళవారం అర్ధరాత్రి దుండగలు ప్రవేశించారు. అక్కడ సీసీపుటేజ్‌లు, లాకర్లు  ఉండడంతో చోరీయత్నం విరమించుకున్నారు. అదే వరుసలో ఉన్న రవి జ్యూయలర్స్‌ను ఎంచుకుని మేడపైనుంచి లోపలికి ప్రవేశించారు. మేడపై ఉన్న గ్రిల్స్‌ తలుపును కట్టర్‌తో చాకచక్యంగా కోశారు. మెట్లమార్గంలో కిందకు దిగారు. ఎటువంటి లాకర్లు లేకుండా, ప్రదర్శనకు ఉంచిన బంగారు ఆభరణాలన్నింటినీ మూటగట్టుకుపోయారు. వెండి వస్తువులను ముట్టుకోలేదు.  

ఆభరణాల విలువ రూ.4కోట్లకు పైనే...  
షాప్‌ యజమాని యథావిధిగా బుధవారం ఉదయం 9.30 గంటలకు దుకాణం తెరిచేసరికి లోపల బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో కలవరపడ్డాడు. దొంగతనం జరిగినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలాన్ని సీసీఎస్‌ పోలీసులు పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి కీలకమైన ఆధారాలను సేకరించింది. ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌ స్వయంగా షాప్‌ను పరిశీలించారు. యజమానితో మాట్లాడి వివరాలు రాబట్టారు. అనంతరం దొంగతనం జరిగిన తీరును నిశితంగా పరిశీలించారు. చోరీ శోధనపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. దొంగలు అపహరించిన 8 కిలోల బంగారు ఆభరణాల ఖరీదు సుమారు రూ.4 కోట్లకు పైబడి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.   

వారం తిరగకముందే...  
వారం రోజుల కిందట రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న సీఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో ఇదే తరహాలో దొంగలోపలికి ప్రవేశించాడు.  లిఫ్ట్‌ బ్రేక్‌ చేసి లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఆభరణాలు కనపడకపోయే సరికి అందుబాటులో ఉన్న నగదును పట్టుకుపోయాడు. తాజాగా రవి జ్యూయలర్స్‌లో వెండి వస్తువులను పక్కన పెట్టి కేవలం బంగారు నగలనే టార్గెట్‌ చేశాడు. చోరీ ఘటనతో వ్యాపారులందరూ భయాందోళనకు గురవుతున్నారు. స్థానిక దొంగలా? అంతరరాష్ట్ర ముఠాల పనా? ఒక్కడే చేస్తున్నాడా? ముఠా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగాయి.  

త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం 
షాపులో లాకర్‌ సదుపాయం లేదు. వస్తువులన్నీ చక్కగా పేర్చి ఉన్నాయి. గ్రిల్స్‌ కట్‌ చేసి లోపలికి ప్రవేశించి వస్తువులను పట్టుకువెళ్లారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్, సీసీఎస్‌ ఇప్పటికే రంగంలోకి దిగాయి. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని ఎస్పీ దీపికా ఎం.పాటిల్‌ తెలిపారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top